పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఫోర్సుడ్ కాంక్రీటుకంటే ధృఢంగా ఎక్కువకాలం నిలిచేలా వీటిని పేర్చగలగటం గొప్పదనమే

శిలాపద్మం

గర్భాలయం పై కప్పుమీద ఒక చక్రాన్ని చిత్రించడం కాకతీయుల ప్రత్యేకత. దేవాలయం పెద్దదయినా చిన్నదయినా గర్భాలయంలోని ఈశ్వరునికి పై భాగంలో అష్టకోణాలతో ఈ చక్రం కనిపిస్తుంది. గణపేశ్వరాలయపు గర్భాలయంలో అర్చామూర్తికి పైభాగంలో ఆలయపు పైకప్పుకు సౌష్టవాకారంలోని రాతి పద్మాలు వున్నాయి. దానిచుట్టూ ఒక క్రమపద్దతిలో చెక్కిన పద్మదళాలు కూడా వున్నాయి. ముక్కంటేశ్వర, వేణుగోపాల అంతరాలయ మంటపాలలోనూ, రంగమంటపంలో కూడా అందమైన పద్మనిర్మాణాలను గమనించవచ్చు.

శిఖరం (విమానం)

కప్పు తర్వాత వుండే శిఖర నిర్మాణాన్ని విమానము అంటారు. అనేక రకాల కొలతలతో నిర్మించటం వల్ల దీన్ని విమానం (నానా మానవిధానత్పాత్ విమానం పరికల్పయేత్) అన్నారు. గణపేశ్వరాలయం ఏకత విమానాలయం. పాలంపేట, గణపురం ప్రధానాలయం, పానగల్లు, కొండపర్తి, నిడికొండ, పిల్లలమర్రి, నాగులపాడు, బయ్యారం ఆలయాలుకూడా ఇదేవిధమైన ఏకత విమానాలయాలే. రామప్ప ఆలయ విమాన శిఖరం తేలికైన ఇటుకలతో మూడంతస్తులుగా కట్టారు. కానీ గణపేశ్వరాలయంలో విమానం శిఖరంలాగా ఎత్తుగా కాకుండా కూటకోట లక్షణంతో ద్రావిడ పద్ధతిలో చదరంగా నిర్మించారు. ఆకారాన్ని బట్టి శిఖరాలకు వేరువేరు పేర్లుపెట్టారు కానీ విమానం ఏ ఆకారంలో వున్నా అంటే చదరంగా, గుండ్రంగా, షట్ – అష్ట భుజ లలా వున్నప్పటికీ దానిని కూటశిఖరం అని అన్నారు. దానిపైన నిధి కలశం వుంటుంది. బహుశా మొత్తం గుడిని ఒక శివలింగాకారంలో భావించి కట్టడం వల్లనే ఇలా విమాన నిర్మాణంలో ప్రత్యేకత పాటించివుంటారేమో. అయితే నిర్మాణం ఇంకా పూర్తికాకముందే ఆపాల్సి రావడం వల్ల కూడా అలా జరిగివుండవచ్చు. కప్పువరకూ కట్టడం పూర్తయిన తర్వాత శత్రుదాడులు లేదా మరేదైనా అవాంతరాలతో నిర్మాణం ఆగిపోవటంవల్ల ఇలా జరిగే అవకాశం వుంది.

రంగమండపం

గణపేశ్వరాలయంలో గర్భగుడికి ఎదురుగా అత్యంత విశాలమైన రంగమండపం వుంది.