పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యత్యాసాలు, భూకంపాలు వంటివాటిని తట్టుకుని తరాల పాటు నిలబడటానికి శ్యాండ్ బాక్స్ విధానం సమర్ధవంతంగా ఉపయోగపడుతుంది అని కొందరంటుంటే, మరికొందరు ఈ శాండ్ బాక్స్ విధానం వల్లనే కాకతీయ ఆలయాలు ఎక్కువగా బలహీనపడ్డాయని వాదిస్తున్నారు.

ఈ అధిష్ఠానం కింద ఉండే వరుసల్ని ‘ఉపపీఠం’ అంటారు. గణపేశ్వరాలయ ఉపపీఠం చూడటానికి ఎత్తుగా, చుట్టూ ప్రదక్షిణ చేయటానికి విశాలంగా ఉంది. ఆధారశిల, ఉపానం, పద్మం, పట్టిక, కుముదం, అథోపద్మం అనే ఉపపీఠం వరుసలపై ఎలాంటి అలంకార శిల్పమూ లేక సాదాగా వున్నాయి.

అధిష్ఠానానికి పైన ఏనుగుల వరుస (గజధార)లు, కమలాల వరుస (పద్మధార) లు బహుశా చుట్టూ వుండేవి కావచ్చు. కాలక్రమంలో శిథిలమైనవి శిథిలమైపోగా మిగిలిన కొన్ని వరుసలూ ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తున్నాయి. పైవైపున సమంగా గర్భాలయ, అర్ధమండప, రంగమండపాల నేల రాళ్ళు పరచబడినాయి.

కక్షాసనాలు, పాదవర్గం


దేవాలయ రంగమండప అధిష్ఠానంపై గల రాళ్ళపై నిలువుగా ఒక పిట్టగోడ లాంటి రాయి వుంది. దీన్ని ‘కక్ష్యాసనం (ఆనుకుని కూర్చోటానికి ఉపయోగపడేది) అంటారు. మండపం లోపల వున్న వరుసల వేదికలు, దానిపై భక్తులు కూర్చోవటానికి అరుగుగా ఉపయోగపడుతుంది. అధిష్ఠానంపైన ఉండే దేవాలయ గోడభాగాన్ని ‘పాదవర్గం’ అంటారు. { {p|fs150}}

ప్రదక్షణా పథం

గర్భాలయం చుట్టూ తిరిగేందుకు ఏర్పాటు చేసిన దారి ఇది. మొత్తం గుడి చుట్టూ తిరిగేందుకు ఒక బాహ్యప్రదక్షణా పథం వుంది. పైన గర్భాలయం చుట్టూ తిరిగేందుకు మరొక ప్రదక్షణా పథం కూడా వుంది. దేవకోష్టాలను, దేవాలయం పై చెక్కిన శిల్పాలనూ, సింహ,గజ, పద్మధారలను గమనించుకుంటూ దేవాలయ ప్రదక్షణ చేసే అవకాశంవుందిక్కడ.