పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాకర్లపల్లి గ్రామముంది. ఇక్కడ కూడా ఆ కాలం నాటి శివాలయం ఉన్నది. ఇటీవలి కాలంలో ఈ దేవాలయాలను పునర్మించారు. వరంగల్ జిల్లా మొగిలిచెర్ల పక్కనే, అంటే వరంగల్ కోటకు పది మైళ్లలోపే బేతవోలు అనే గ్రామం వుంది. ఇప్పుడు దానిని బేతోలు అంటున్నారు.

బేతరాజు మరణించిన తర్వాత మొదటి ప్రోలరాజు సింహాసనమధిష్టించాడు. ఇతని పాలనాకాలం 1052 నుండి 1072 వరకు నడిచింది.

మొదటి ప్రోలరాజు పాలనానంతరం రెండవ బేతరాజు 1079నుండి 1108 వరకు పాలించాడు. కాజీపేట శాసనంలొ ఇతన్ని గొప్ప వీరుడిగా వర్ణించబడివుంది.

ఇతడి పాలనానంతరం ఇతని పెద్ద కుమారుడు దుర్గరాజు 1108 నుండి 1116 వరకు పాలించాడు.

తదుపరి రెండవ ప్రోలరాజు పరిపాలన కొచ్చాడు. ఇతడు 1116 నుండి 1157 వరకు 41 సంవత్సరములు పరిపాలించాడు. ఇతని కాలంలో కాకతీయ రాజ్యము పూర్తిగా బలపడి సర్వ స్వతంత్రమయ్యింది.

తర్వాత రుద్రమదేవుడు 1158 నుండి 1195 వరకు రాజ్య పరిపాలన చేసాడు అనేక యుద్ధాల ద్వారా తన రాజ్యాన్ని విస్తరించాడు కూడా. వేయి స్తంభాల దేవాలయ సముదాయాన్ని క్రీ.శ. 1163లో కాకతీయ రాజు ఒకటవ రుద్రదేవుడు నిర్మించాడని చెప్పే శాసనం ఉంది.

రుద్రమదేవుడి మరణానంతరం మహాదేవ రాజు 1196 నుండి 1198 వరకు కేవలం రెండు సంవత్సరములు పాలన చేసాడు. మహాదేవరాజు రుద్రమదేవుడి సోదరుడే. ఇతని మరణాంతరం కాకతీయ ప్రభువులలో అగ్రగణ్యుడైన గణపతిదేవుడు రాజయ్యాడు.

గణపతిదేవుడు 1199 నుండి 1226 వరకు సుదీర్ఘకాలం పరిపాలన చేసాడు. ఇతని కాలంలో కాకతీయ సామ్రాజ్యం చాలా వరకు విస్తరించింది. కూసుమంచి గణపేశ్వరాలయానికి గణపతిదేవుని వలన ఆ పేరు వచ్చింది అని పైభాగాలలో చెప్పుకున్నాం. గణపతిదేవునికి ఆ పేరురావడానికి కారణాన్ని చెప్పే కథను ప్రతాపరుద్ర చరిత్ర(పేజి 28) సిద్ధేశ్వర చరిత్ర (పేజీ 109) లలో చూడవచ్చు. మహదేవరాజుకు చాలా కాలం సంతానం లేకపోవడంతో శ్రీశైల మల్లికార్జున స్వామిని సేవించి వంశాంకురంకోసం ప్రార్ధిస్తూ, అక్కడ వున్న 10వేల మంది మఠాధిపతులను సేవిస్తూ కొంత కాలం గడిపాడు. ఆ విధంగా గణారాధన ఫలితంగా జన్మించిన వాడు కాబట్టి ‘గణపతి’ అనే పేరు పెట్టారట. గణపతిదేవుని ఓరుగల్లు శాసనంలోని బిరుదుగద్యలో కనిపించే ‘ప్రత్యక్ష ప్రమథగణావతార’ (కాకతీయ వైభవం పుట 10) అందుకు మంచి నిదర్శనం.