పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రోజున భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ప్రత్యేకంగా శివరాత్రి పర్వదినం రోజునైతే లక్షలాదిమంది భక్తులు గణపేశ్వరాలయాన్ని సందర్శించుకుంటున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల వారేకాక రాష్ట్రం నలుమూలలనుండికూడా ఆలయసందర్శన చేసుకుంటారు. సిఐ ప్రతాప రెడ్డిగారి తర్వాత కూసుమంచి సర్కిల్ కు వచ్చిన మరికొందరు పోలీసు అధికారులు శ్రీ బాలకిషన్, శ్రీ సాయిబాబా, శ్రీ వెంకట్రావు, శ్రీ సునితారెడ్డి, శ్రీ నరేష్ రెడ్డి మొదలైన వారుకూడా అదే ఆనవాయితీని కొనసాగించి ఆలయం అభివృద్ధికి తమ సహాయ సహకారాలనందించారని గ్రామప్రజలు చెపుతారు. ప్రస్తుతం దేవులపల్లి శేషగిరి శర్మగారు పూజారిగా పనిచేస్తున్నారు. ఆ తర్వాత 2002 నుంచి దేవాదాయ శాఖ తన ఆధీనంలోకి ఈ దేవాలయాన్ని తీసుకుని కొంతమేరకు అభివృద్ధికార్యక్రమాలను చేపట్టడంతో పర్యాటక ప్రాంతంగా కొంత అభివృద్ధి చెందింది.


కూసుమంచి ఊరిపేరు వెనక

కాకతీయుల కాలంలో దేవాలయాలను కేవలం రాజధాని ప్రాంతంలోనో పెద్దపెద్ద జనావాసాలున్న చోట మాత్రమే కాకుండా వారి రాజ్యం నలుమూలలా విస్తరించేలా కట్టారు. ఆలయం, నగరం, నీటివసతిని ఒక క్రమబద్దమైన పద్దతిలో అమరిక కలిగివుండేలా జాగ్రత్త పడ్డారు. కాకతీయ నిర్మాణశైలికి పరాకాష్టగా భావించే రామప్ప దేవాలయం కూడా పాలంపేట అనబడే చిన్న ప్రాంతంలో నిర్మించారు. అది రాజధానిగానో, వర్తక వ్యాపారాలూ నిర్వహించిన అతిపెద్ద పట్టణ ప్రాంతంగానో ఎక్కడా ఆధారాలు దొరకలేదు. పైగా మొన్నమొన్నటి వరకూ కూడా తుప్పలూ, చెట్లతో నిండిన మారుమూల అరణ్య ప్రాంతంగా వుంది. ఖమ్మంజిల్లాలోని గణపేశ్వరాలయం నిర్మాణం కోసం ఎంచుకున్న కూసుమంచి ఊరు పేరును గమనిస్తే ఇది మొదటినుంచి స్వల్ప జనావాస ప్రాంతమేనేమో అనిపిస్తుంది.

పేరునుబట్టి చూస్తే ‘కూసు’ అంటే చిన్న, సులభసాధ్యమైన అని అర్ధం. కూసుమంచి అంటే చిన్నఊరు అనే అర్ధంలో తీసుకోవచ్చు. అభ్యాసం కూసు విద్య అనే సామెతలో ఈ పదం ఇప్పటికీ వాడుకలోనే వుంది. వైష్ణవ సంప్రదాయాలలో ఒకటైన సాతాని మతం(చాత్తాద వైష్ణవం)లో కూడా కూసుమతం, కూచిమతం అనే ఒక శాఖ వుంది.

కొంచెము అనేందుకు కూసింత, కూసంత అనే పదాలను కాస్తంత అనే రూపంలోనూ వాడుతున్నాం. కూచి అంటే కూడా చిన్న అనే అర్ధం వుంది. కూచికుండ అనేది ఇలా