పుట:Ganapati (novel).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

యుండవచ్చు. అట్లే గంగాధరుఁడు పాకశాస్త్ర మందును జలవాహన శాస్త్రమందునుగూడ నధికపరిచితుఁడై జలవాహన శాస్త్రమందె యధికాభిమానముగలిగి విశేషాభ్యాసము చేసెనని గ్రహింపవలయునేకాని పాక శాస్త్రమందు బరిచితి లేదని గ్రహింపఁగూడదు. ఈ కారణమున గంగాధరునఁకు బాకశాస్త్రమందుఁ బరిచితి గలదని మీ రొప్పుకొనక పొవుదురేని సింహాచలమునకిష్టమైన పిండివంట వండి పెట్టుచుండెడివాఁ డని యిదివర కుదాహరింపఁ బడుటచేత మీరీవాద మంగీకరింపవచ్చును. ఒక సంవత్సరము శ్రావణ మాసములో నీయింటిమీఁద కాకి యాయింటిమీఁద వ్రాలకుండ నాకసము చిల్లిపడునట్లు వాన కురియుచుండఁగా గంగాధరుఁడు జడివానలకు లెక్కపెట్టని దున్నపోతువలె నించుకేనియఁ జలింపక నెప్పటి చాకచక్యముతో నీళ్ళు మోయచుండుటఁజూచి చ్ఛందశ్శాస్త్రము నూతనముగ నేర్చికొని పద్యములు చెప్పవలయునని యుబలాటము బడుచున్న యొక బాలకవి గంగాధరుని ప్రజ్ఞ నొక విషయముగఁ బుచ్చుకొని కొన్ని పద్యములు రచించెను. ఆ పద్యములు లభింపలేదు. కాని వాని యందలి భావము మాత్రము మాకు లభించినందున క్షీరమును విడిచి దాని సారమైన మీగడముద్ద నిచ్చి నట్లు తత్సార మిందుఁబొందుపఱుపఁబడుచున్నది. "ఓగంగాధరా! నీప్రజ్ఞ వర్ణించుట కాదిశేషువునకు వేయినాలుకలు చాలవు. నీవు కావిడిబద్ద పట్టుకొన్నప్పుడు గాండీవము ధరిం