పుట:Ganapati (novel).pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

91

ద్రము దాటెను. లక్ష్మణస్వామి మూర్ఛపోయినపు డాంజనేయులు వెఱ్ఱిపడి సంజీవిఁ దెచ్చెను. కాని వుప్పుకలపిన పుల్లని తరవాణి గిద్దెడు నోటిలోబోసిన యొక పచ్చియుల్లిపాయ నంజుకొనబెట్టినచో గిరుక్కున లేచి కూర్చుండకపోయెనా? తెలివితేటలు లేవు. తరవాణికుండ నూరావుల పాడిపెట్టు, ఆవులకు గడ్డికావలె, గాదము కావలె ఒకపూట దూడ కుడుచుకొని పోవుట, మఱియొకపూట తన్నివేయుట మొదలగు చిక్కులు గలవు. తరవాణికుండ కట్టి చిక్కులు లేవు అదిలేని కొంప కొంపగాదు. రోగములువచ్చి నపుడు పాడుకషాయములు రుచిలేని యరఖులు త్రాగి గిజగిజ తన్నుకొనుటకంటే మాత్రవేసికొని తవ్వెడేసి తరవాణి త్రాగితే యెక్కడ జబ్బక్కడ యెగిరిపోవును. తరవాణి త్రాగుమని చెప్పని వైద్యుడు వైద్యుడా? కుడితి పశువుల కెంతబలమొ మనుష్యులకు తరవాణి యంతబలము."

ఇట్లు పలుమా రుపన్యాసములు చేయుటతో దనివిఁ జెందక తరవాణికుండలు కొందరి యిండ్లలో బోధచేసి పెట్టించెను. మిక్కిలి రుచిగానున్న వస్తువు దిన్నప్పు డెవరైన "వహవా! యిది యమృతము లాగున్నదిరా" యని మెచ్చి రేని గంగాధరుఁడు వెంటనే కోపపడి "ఛీ! అమృతము లాగున్నదనుచున్నావా? తరవాణిలాగున్నదని చెప్పు" మని చీవాట్లు పెట్టుచుండును. అట్టివాండ్రు చిన్నవాండ్రైన యెడల నట్టిమాటలిక నెన్నఁ డనవలదని బుగ్గలు నులిమి యొకటి రెండు చెంపకాయలు గొట్టుచుండును.