పుట:Ganapati (novel).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

నెన్నిమారులుతిన్న నెంతతిన్న నెక్కడతిన్న తప్పులేదని నమ్మి నమ్మినట్లు నడచుచుండును. వివాహాదికార్యములలో నతఁడెక్కడికైన సంభావనలకు వెళ్ళినప్పుడు పదిమందిని జట్టుఁ జేర్చుకొని యతఁడు తరవాణి మీద యుపన్యాస మిచ్చునపుడు విని తీరవలయును. మతిలేని బ్రహ్మదేవుఁ డోర్వలేక యతనిని నిరక్షకుక్షిని జేసెఁగాని నిజముగ నతనికి విద్యా పరిచయమున్న పురాణమొ వ్రాసియుండును. వానింగూర్చి యతడు పెద్దవాఁ డైనతరువాత నప్పుడప్పుడు చేసిన యుపన్యాసములలోని సారాంశములు కొన్ని యీక్రింద నుదహరింపబడుచున్నవి.

"దేవతల కమృతము మనుష్యులకు తరవాణి బ్రహ్మదేవుడు విధించినాడు. అమృతము మీఁద విసుగెత్తి దేవతలు తరవాణి కొఱకు తపస్సు జేసినారు. కాని యిది వారికి దొరకలేదు. గ్రుక్కెడు తరువాణి త్రాగెనా చంద్రుని కళంకమిన్నాళ్ళుండునా? దినమునకు ముమ్మారు మూఁడు సత్తుగిన్నెల చొప్పున తరవాణి మండలము సేవించెనా సాంబమూర్తి కంఠములోని నలుపు హరించిపోదా? ఇది రెండు చుక్కలు నోటిలోఁ బడెనా శివునకు విసముఁదిన్న వెగటు నశింపదా? ఈ తరవాణి త్రాగియె భీముఁడు దుర్యోధనుని తొడలు విరుగఁ గొట్టెను. అర్జునుఁడు శత్రువులను జావఁగొట్టెను. వానరులు వారధిగట్టిరి, ఆంజనేయులు సము