పుట:Ganapati (novel).pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

81

పరమార్థముల నెఱిగి పనిచేయువారికడ స్త్రీల దీనాలాపములు పనిచేయునా? దీనురాలైన బిడ్డలను విడిచివెళ్లుట న్యాయముకాదని గ్రామస్థులు మందలించినప్పు డన్న్నప్ప వారి కిట్లనియె. "అయ్యా! మీకేమి? పై నుండి యెన్నిమాటలైన జెప్పవచ్చును. మునుపు పాపయ్య సంపాదించి తెచ్చిపట్టుచుండెడివాడు గనుక నేనెన్ని దినము లున్నప్పటికి విచారము లేకపోయెను. క్రొత్తడబ్బు వచ్చునట్టి విధములేదు. నా కుటుంబముతో నేనిక్కడఁ గూర్చుండి తిన మొదలు పెట్టితినా వాళ్ళ కొంపగూడ పోవును. నేను నాయింటికి వెళ్ళి నాపొట్ట నేను పోసికొంటినా నాబిడ్డకు భారముండదు. దాని గంజియది త్రాగి దాని యిల్లది దిద్దుకొనుచుండెనా నేనప్పుడప్పుడు వచ్చి చూచిపోవుచుందును. ఇలా నాబిడ్డ క్షేమము కొఱకు చేయుచున్న పనిగాని మఱియొకటి గాదు. "ఆ యుత్తరము విని నమ్మినవారు నమ్మిరి. నవ్వినవారు నవ్విరి. విచారించిన వారు విచారించిరి. ఎన్ని విధములఁ దాను బ్రతిమాలినను వినక తండ్రి వెళ్లిపోవుటకై సంకల్పించుకొని యున్నాఁడని దృఢవిశ్వాసము దోఁచిన తరువాత నొకనాటిరాత్రి పిచ్చమ్మ తండ్రినిఁ బిలిచి దగ్గఱఁ గూర్చుండి పిల్లవాని నతని యొడిలో బెట్టి పొరలి పొరలి వచ్చు దుఃఖమాపుకొనలేక కొంతసేపేడ్చి గద్గదస్వరముతో నిట్లడిగెను. "నాన్నా! మీ యల్లుడు పోయి యిప్పటి కెనిమిది మాసములైనను నేను నోరెత్తి మాటలాడలేదు. ఏమున్నదో యేమి లేదో నే నెఱుఁగను.