పుట:Ganapati (novel).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

గ ణ ప తి

యాస్తి గలదాయని యన్నప్ప నడిగినప్పు డతఁడిట్లు చెప్పు చుండెను. "పాపయ్య పునహాసతారాలు వెళ్ళి యేదోమూట సంపాదించి తెచ్చినాడన్న పేరేగాని ప్రాణము బోవునప్పటికి పట్టుమని పదిరూపాయలు లేవు. దినవారములకర్చు నేనే పెట్టితిని. పిల్లవాఁడు మీ గ్రామస్థుడగుటచేతను, పాపయ్య మిమ్మునే నమ్ముకొని యుండుటచేతను మీరే వీరిని గాపాడవలెను".

ఇట్లనుటలో చిన్నప్ప యసత్యమాడెనని మనము తలంపఁగూడదు. పాపయ్య పోవునప్పటి కింటిలో రొక్కము పది రూపాయాలైన లేనిమాట నిజమే. ఉన్నసొమ్ము బదులిచ్చి యుండుటచే నన్నప్ప దినవారములకు కర్చుపెట్టిన మాట నిజమే. దినవారములు నలువది రూపాయలలో దేల్చెను. పాపయ్య కుటుంబమును గ్రామస్థులు పోషింపవలసిన మాట నిజమే. ఏలయన మనపాపయ్య భార్యపేరగాని కుమారుని పేరగాని చిల్లిగవ్వలేదు.

అల్లుఁడు పోయిన తరువాత నన్నప్ప యాఱు మాసముల కాలము మందపల్లిలో నుండి పిమ్మట మూలస్థానము వెళ్ళవలసిన పనియున్నదని ప్రయాణము లారంభించెను. అల్లుఁడున్నప్పుడతనికి మంచి తిథిగాని ముహూర్తముగాని శకునముగాని దొరకుటయె దుర్లభమయ్యెను. ఈసారి ప్రయాణయోగ్యములైన మంచితిథు లనేకములు లభించెను. తన్ను విడిచి వెళ్ళవద్దని కూతురు బహువిధముల బతిమాలెను.