పుట:Ganapati (novel).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

77


“అమ్మాయీ! నీమగనియొద్ద గొప్పగానో కొంచెముగానో ద్రవ్యమున్నట్లు విన్నాను. అతఁ డది యితరులకు బదులిచ్చి యున్నాఁడు. దస్తావేజులమీద నిచ్చినాఁడో నోట్లమీఁద నిచ్చినాఁడో తెలియదు. కాగితములు ముందుగఁ జూడనీ. ఊరకుంటిమా కాలదోషము పట్టగలదు. అటుతరువాత మనము చేయవలసిన పనిలేదు. చీమతలకాయంత సందు దొరకెనా యప్పు పుచ్చుకున్న వాండ్రెగబెట్టుటకె ప్రయత్నము సేయుదురు. లోకులు దుర్మార్గులు అందులో నీయూరివారు మరియు దుర్మార్గులు. అందుచేత సందువాపెట్టి తాళముచేయి నాచేతికిమ్ము; కాగితములు చూచి యవసరమైనపని చేసెదను.” అని బుజ్జగించి పలుకుటయు దుస్సహమైన నవవైధవ్య దుఃఖమున మఱగుచున్న పిచ్చమ్మ తన ప్రాణములు దాఁచిన పెట్టెతాళమిచ్చినదో యన్నట్లు సందువాపెట్టె తాళముచేయి దండ్రిచేతి కిచ్చెను. ఆతఁడు మెల్లగా నందులోనున్న నోటులన్నియుఁ దీసిచూడఁగా మొత్తము పదియేనువందల రూపాయలుండెను. ఆకాగితములు తీసికొని వెంటనే యతఁడు బాకీదార్ల వద్దకు వెళ్ళి యానోట్లు తిరిగి తనపేర వ్రాయమని కోరెను. భార్యయుండగఁ గుమారుఁ డుండ మీపేర నేల వ్రాయవలయునని యందుఁ గొందరడిగిరి. అట్టియనవసర ప్రశ్నముల కన్నప్ప యిట్లుత్తరము చెప్పెను. “అయ్యా! మీరనుమానించవద్దు. నా బిడ్డసొమ్ము నాకక్కఱలేదు. మగపిల్లలకంటె నాకాఁడుపిల్లల మీఁదనె ప్రేమ యెక్కువ. నా