పుట:Ganapati (novel).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

గ ణ ప తి

పాపయ్య కాలధర్మము నొందినాఁడు. కాని యతఁడార్జించిన ధనము చాలవఱకు వ్యయమైనను యశస్సు తరుగలేదు. వేదశాస్త్రంబులు చదువుకొననివారు జదువుట వ్రాయుటచేతగానివారు హాయిగా శవములు మోసికొని బ్రతుకవచ్చుననియు ధన మార్జింప వచ్చుననియు నాంధ్ర ప్రపంచమునకు బోధించిన ప్రథమాచార్యుఁ డతఁడే కదా. స్వదేశమున నన్నవస్త్రములు దొరకనప్పుడు విదేశములకు వెళ్ళి ప్రఖ్యాత పురుషులు కావచ్చునని తెనుఁగునాఁడు వారికి నేర్పిన పరమ గురువతఁడే కదా! ఏఁబది సంవత్సరముల వరకు స్వకాయకష్టపడి ధన మార్జించి తాను సంపాదించిన విత్తము విదేశములలో వ్యయముఁ జేయక స్వదేశాభిమానముఁ గలిగి వార్ధక దశయందు స్వస్థలమునకువచ్చి స్వగ్రామాభిమానముఁ బూని మందపల్లిలోనే నివసించి తాను జన్మించిన చోటనే మృతినొందిన దేశాభిమాని యితఁడే కదా! అందుచేతఁ నతఁడాంద్రుల కందఱకుఁ గాకపోయినను నతని యభిప్రాయముతో నేకీభవించు వారికైనను మాననీయుఁడు. ఈతని మార్గ మనుసరించి యీనాఁడు సయిత మాంధ్రులనేకులు విదేశములోనె గాక స్వదేశములో గూడ నొకరి నాశ్రయించవలసిన పనిలేని యావృత్తి నవలంబించి జీవయాత్రను జరుపుచున్నారు. పాపయ్య యొక్క యుత్తరక్రియలు నెరవేర్చిన తరువాత నన్నప్పకూఁతురు దగ్గఱచేరి యామెకు సంభవించిన దురవస్థకు మఱియొకసారి విలపించి యిట్లనియె.