పుట:Ganapati (novel).pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

75

కాఁగానె యాముచ్చటఁ జూచి వెళ్ళదలచెను, అన్నప్రాశమైన తరువాత ప్రయాణమునకు మంచిముహూర్త మన్నప్ప వెదకిపెట్టెను. ఆముహూర్తపటుత్వ మెట్టిదో కాని యాసమయమున కన్నప్పగారి ప్రయాణ మాగిపోయి పాపయ్య కూర్థ్వలోక ప్రయాణము సంప్రాప్తమయ్యెను. గొప్ప జ్యోతిష్కుఁడు పెట్టిన ముహూర్తమగుటచే నప్పుడెవరికో యొకరికి ప్రయాణముకాక తప్పినదికాదు. పాపయ్య యదివరకు మూఁడు నాలుగు దినములనుండి వరుసగ శ్రాద్ధభోక్తయై పెసరపప్పు గారె లరిసెలుఁ దినియెను. వార్ధక మగుటచే నమితభోజనము సరిపడకపోయెను. ఆ దినములలో మందపల్లిలో మరిడిజాడ్యములు బయలుదేరెను. పాపయ్య దానివాతఁబడెను. లోకమునకు విశ్వాసములేదు. కోటి యనాథప్రేతలను గట్టిపుల్లల వలె కాల్చిన పాపయ్యను మట్టిచేయుట కెవ్వరు రారైరి. ఎట్టకేలకు మామగారును మఱియొకరును సాయముపట్టి యెట్టెటో సంస్కారము జేసిరి. అన్నప్ప మందపల్లి విడిచి పెట్టి వెళ్ళుటకు శాశ్వతముగ వీలు లేకపోయెను.

ఐదవ ప్రకరణము

మనుష్యులు గతింప వచ్చును; కాని వారు సంపాదించిన యశస్సు వారి యనంతరమునఁ జాలకాలము నిలుచును.