పుట:Ganapati (novel).pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

గ ణ ప తి

కూతు నొక్కరిత సత్తాడు బిడ్డలులేని యత్తవారియింట విడిచిపెట్టి యెంతనిర్దయులైన తలిదండ్రులైనను వెళ్ళఁజాలనప్పుడు తన పుత్రికయె తనపాలిటి భాగ్యదేవతయని కల్పవృక్షమని భావించుకొనుచు బ్రియపుత్రికనెడబాసి యుండుటకన్న లోకనిందకైన నోర్చి దానిదగ్గఱనె యుండుట మంచి దనుకొనుచున్న గారాబు తలిదండ్రులు విడిచి రాగలరా? రమ్మని ఱాతిగుండెవాఁడైన ననఁగలడా? అక్కడ నుండబట్టి తన కెన్నోపనులు చెడిపోవుచున్నవనియు దనకు వెళ్ళకతీరదనియు జెప్పి యన్నప్ప రెండు మూడుసారులు పయనమయ్యెను. కాని యీసారి యల్లుడేబతిమాలి యాయననాపెను. అల్లుని మాట నన్నప్ప తీసివేయలేక యాగెను. పిచ్చమ్మకు తొమ్మిది నెలలు నిండెను. పదియవ మాసమున మూడుదినములు కష్టపడి యామె సుఖముగఁ బ్రసవించెను. మగశిశువు గలిగెను. ఏఁడవనాఁ డాశిశువు పోరుపెట్టెను. పిచ్చమ్మతల్లి కన్నప్ప గారి తండ్రి గంగయ్య కలలోఁ గనఁబడి తనపేరు పెట్టుమని కోరెను. అట్లె చేయుదుమని యింటిల్లిపాది మ్రొక్కుకొనిన తోడనే శిశువు పోరుమానెను. పదునొకండవనాఁడు పురిటిశుద్ధి కాఁగానె బారసాల యయ్యెను. బాలునకు గంగాధరుఁ డని పేరుపెట్టిరి. చంటిపిల్ల తల్లిని విడిచిపెట్టిపోవుటకు మనసొప్పక విధిలేక యన్నప్ప యల్లుఁడును, మఱికొందఱును బతిమాలిన పిదప మనుమనికి నాలుగు మాసములు వచ్చువఱకు నుండదలఁచెను. తరువాత నాఱవమాసమున నన్నప్రాశనము