పుట:Ganapati (novel).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

గ ణ ప తి

పట్టెడన్నమైనను బెట్టలేక లేవఁగొట్టిన నీ పరువు మీఁద నిప్పులు పోయ, నీదిగూడ నొకబ్రతుకట్రా. ఇరుపార్శ్వముల నన్నదమ్ములుగాని యక్క సెల్లెండ్రుకాని చుట్టములుఁ బక్కములుగాని లేని సన్యాసి ముండాకొడుకు; వీఁడు దిక్కుమాలిన పాడకట్టు; గంజికాచి పోసెడు దిక్కైనలేదు; పెండ్లియైన మరునాటి నుంచియు సోలెడుబియ్యము తానే పొయ్యిమీఁదఁ బెట్టుకొని చేతులు గాల్చుకొని నిత్యవిధిలాగున వండుకొని తినవలె పాపమని జాలిపడి ఉపకారబుద్ధిచేత నేను పదిదినములు పనులు చెరుపుకొని గంపంత కమాటము వదలుకొని రెండుపూటలు నాభార్యచేతనే మడికట్టించి యీవల చెంబావలఁ బెట్టియెఱుఁగని నాకూతురుచేత పయిపని చేయించి వేడిచేసి నాకళ్ళుమసకలు గ్రమ్మినప్పటికి నాలోనేనే యోర్చుకొని నేను కూలివానివలె రాత్రింపవలు చాకిరీ చేయగా నా చాకిరీ విషమమైనది. ఛీ, నీకొంపలో నేనొక్కగడియ యుండను. ఓసీ! ప్రయాణమై మూఁట గట్టవే. పిల్లను పిల్లవానిని లేపవే, ఈ రాత్రి నీకొంపలో నుంటివనా ఛండాలుఁడే సరి”

అని లోనికివెళ్ళి నిద్రపోవుచున్నపిల్లలను లేపి తనబట్టలు కొన్ని, పాపయ్య బట్టలుకొన్ని, తన చెంబులు కొన్ని, పాపయ్య చెంబులు కొన్నికలిపి మూటగట్టుకొని యామూట నెత్తిని బెట్టుకొని యాలుబిడ్డలను వెంటబెట్టుకొని “నాకంఠములోఁ బ్రాణముండగాఁ నేనీకొంపలో దిరిగి యడుగుపెట్టను. ఇంతయవమానము జేసిన తరువాత నే నీ గ్రామము మరల