పుట:Ganapati (novel).pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

65

పన్నము పప్పు నధమపక్ష మొకకూర పచ్చిపులుసు మొదలగునవి కావలసివచ్చెను. నడుమనడుమ మినపసున్ని, యరిసెలు, వేపుడుబియ్యము నటుకులు మొదలగు నుపాహారములు కావలసి వచ్చెను. గాదిక్రింది పందికొక్కువలె మామగారు తనయింటఁ జేరి దోచుకొని తినుచున్నాడనియుఁ బూర్వము పునహానగరములో సంపాదించిన ధనము పెండ్లికుమార్తె యోలినిమిత్తమైననేమి, పెండ్లికర్చుల నిమిత్తమైన నేమి నవ్వలి ఖర్చులకైన నేమి మొత్తముమీఁద నన్నప్పగారి నిమిత్తమే వ్యయమైనదని పాపయ్యకు విచారము పుట్టెను. చూచిచూచి మామగారిని వెళ్ళగొట్టఁలేడు. వివాహమైన తరువాత పాపయ్యను కలిసికొన్నవారందఱు మామగారి యద్భుత ప్రజ్ఞావిశేషంబు లప్పడప్పుడు కైవారములు చేయుచుండుట చేత నన్నప్ప కాగ్రహము దెప్పించుటకిష్టములేదు. అన్నప్ప తనంతట తానువెళ్ళునట్లు కనఁబడలేదు. వివాహమై యప్పటి కారుమాసము లయ్యెను. అత్తగారి కుటుంబ భరణమునకైన వ్యయ మటుండఁగా మామగారప్పు డప్పుడు చేఁబదులు పుచ్చుకొన్న దేఁబదిరూపాయ లయ్యెను. మందపల్లి నీళ్ళు తనకి వేఁడి చేసినవని యన్నప్ప వారమున కొకసారి యావు నేతితో మంగలిచేత దల యంటించుకొని తలయంటుకూలియు నేతివెలయు నల్లునకె గట్టుచుండెను. భార్యవచ్చిన దన్న సంతోషముపోయి పాపయ్యకు మామగారి రూపమున శని దాపురమయ్యెనని విచారము పుట్టెను. శనిగ్రహపీడ వదలించు