పుట:Ganapati (novel).pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

గ ణ ప తి

ణమున కాటంకమే గలిగించిరి. మూల స్థానమునకు వెళ్ళి స్వగృహమున గాపురము జేసినయెడల దనసొమ్ము కర్చుపడునను భయమున నన్నప్ప యేదో వంక బెట్టి మందపల్లిని విడువక యల్లుని యింటనే తిష్టవేసుకొని తేరకూడుతినుచున్నాడని గ్రామస్తులు కొందఱు చాటుచాటున ననుకొనుచున్నట్లు విని యతఁడు తీవ్రకోపముదాల్చి మందపల్లివాసు లందఱుఁ దుంటరులని నీచులని తిట్టి “ఛీ! యీ గ్రామమం దొక్క నిమిషమై నుండగూడ” దని యల్లునిమీఁద గూడ గేకలు వైచి కూఁతును గొడుకును భార్యను దీసుకొని బయలు దేరెను. ఆ ముహూర్త బలిమి యెట్టిదియొగాని వారు పొలిమేర దాటి యైన వెళ్ళకమునుపే గొప్ప మబ్బు పట్టి యురుములతో మెరుపులతో నేనుఁగు తొండములావు ధారలతో గొప్ప వర్షము కురిసెను. అన్నప్ప సకుటుంబముగ నిలువున నీరై తడిసి మోపెడై దైవప్రాతికూల్యమున కేమియుఁ జేయఁజాలక విధిలేక మరల జామాతృగృహము జేరవలసినవాఁ డయ్యెను. అల్లుడు పదియవ గ్రహమని లోకమున నున్నసామెత యీ విషయమునఁ దారుమారై మామగారే పదియవగ్రహమైనట్లు లోకులకుఁ దోఁచెను. స్వగృహమున నున్నపు డన్నప్పకు పాతయుసిరిక పచ్చడియొ కాల్చినమిరపకాయయొ గంజియొ చింతపండు పచ్చడియొ నన్నమున కాధారముగ నుండినఁ జాలును. తత్త్వము మారిపోవుటచేతనో మఱి యేకారణముచేతనో యల్లుని యింట నున్నంతకాల మన్నప్పకు బాతబియ్య