పుట:Ganapati (novel).pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

వెంటనే మూలస్థానము వెళ్ళఁదలఁచెను, కాని పదియాఱు దినముల పండుగైన తరువాత వెళ్ళుటమంచిదని యాగెను. ఆ పండుగ ముగిసిన తరువాత నన్నప్ప భార్యకు బెండ్లి బడలిక వలనఁ గొంచెము జబ్బుచేసెను. అది నివారణ మగునప్పటి కన్నప్పకే కొంచె మనారోగ్యము కలిగెను. అన్నప్ప తుదకు నెమ్మదిగా నున్న తరువాత బయలుదేరి పోవలయునని పంచాంగము జూడఁగా నొకనాఁడు వారము మంచిది కాకపోయెను. మరి యొకనాఁడు తిథి మంచిది కాకపోయెను. వేరొకనాఁడు నక్షత్రము మంచిది కాకపోయెను. ఇవి యన్నియు గుదిరి యెకనాఁడు బయలుదేరఁగా పిల్లి యెదురుగా వచ్చినందున నాదినమునకుఁ బ్రయాణ మాగిపోవలసి వచ్చెను. తిథివార నక్షత్రములు మరల గుదురునప్పటి కొక్క మాసము దినములు పట్టెను. అప్పుడన్నప్ప బయలుదేఱి వీధిలోనికి రాఁగానే యతని నిమిత్తమే కనిపెట్టుకొని యున్నట్లు చేతనొక పిడకయు బిడకమీఁద నిప్పును బెట్టుకొని వితంతు వెదురుగా వచ్చెను. క్రొత్త పెండ్లికూఁతుర్ని దీసికొని యట్టి దుశ్శకున సమయమున బయలుదేరుట యెంతమాత్రము సముచితముకాదని యన్నప్ప గిరుక్కున వెనుకకు మరలి తరువాత రెండుమూఁడు ముహూర్తములు ప్రయాణము నిమిత్తము పెట్టించెను. ఒంటిబ్రాహ్మణుఁ నొకసారి తెలికలి వాఁడొకసారి యెదురుగావచ్చి ప్రయాణమునిలిపిరి. వెయ్యేల, మందపల్లిలోనున్న వారంద రేదోవిధముగ నన్నప్ప ప్రయా