పుట:Ganapati (novel).pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

61

దనిపించెను. ఇంక భోగము మేళమునుగురించి రెండుమూఁడు మాటలు చెప్పవలెను. పాపయ్య జన్మముచేత శుద్ధవైదికుఁడైనను జాలకాలము పునహానగరములో నివసించిన నాగరకుఁడగుటచే గొప్పరసికులలో జేరినవాఁడు కావున శృంగార దేవతలగు వేశ్యలులేని పెండ్లి పెండ్లికాదని యభిప్రాయపడి వెలయాండ్రకుఁ బ్రసిద్ధికెక్కిన పసలపూడి మండపేట మొదలగు గ్రామములకుఁ బ్రత్యేకముగ మనుష్యులనంపి మేళములకై ప్రయత్నించెను. అది వివాహకార్తియగుటచే మేళము లన్నియు నందందు గుదిరి యుండుటచేఁ దగిన మేళము దొరకలేదు. మేళముండితీరవలయునని పాపయ్య పట్టు పట్టెను. అందుచేత నతనిమిత్రుఁడొకమేళము దీసుకొనివచ్చెను. ఆవేశ్యపేరు చంద్రవదన. చిన్నప్పుడది మిక్కిలి చక్కనిదె కాని మశూచికపు మచ్చలు మొగమునుండుటచేతను కుడికాలుకొంచెము వంకరగనుండుటచేతను దానినెవ్వరు మేళమునకుఁ బిలుచుటలేదు. దానివెనుక తాళహంగు చేయునది పాటకత్తెయే కాని కొంచెము నత్తియగుటచే దానిపాట శోభించుటకు వీలులేక పోయెను. కుంటిదైననుసరే గ్రుడ్డిదైననుసరే నత్తిదైననుసరే నంగిదైననుసరే వేశ్య వివాహ కాలమునఁ బెండ్లి పందిరి నలంకరించవలయు నని పాపయ్య ధృడసంకల్పముఁ జేసుకొని యుండుటచే నమావాస్యనాఁటి చంద్రబింబమువంటి మొగము గల యాచంద్రవదననను బిలిపించి పాపయ్య మేజువాణి చేయించెను. వచ్చినబంధువులు దోషైక ద్రుక్కులు గాక