పుట:Ganapati (novel).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ ప్రకరణము

వివాహ సంబంధములైన వేడుకలు విశేషముగా వర్ణింపఁ దలచుకొనలేదు. అయినను ముఖ్యమైన వొకటి రెండు కలవు. పప్పుభొట్లవారితో నన్నంభొట్లవారు వియ్యమంది నప్పుడు వారికుభయులకు ననాదిబంధువులైన నేతివారు దయచేసి వారితోఁ గలసి మెలసి వివాహమున కెంతో శోభదెచ్చిరి. నేతివారుగాక ముఖ్యముగ నన్నంభొట్ల వారికి బంధుమిత్రులైన కందావారు చెమ్మకాయలవారు బీరకాయలవారు చేమకూరవారు వంకాయలవారు మిరియాలవారు దోసకాయలవారు దయచేసి రేయింబవళ్ళు విరిగి ముక్కలగునట్లు పనిచేసి మెప్పువడసిరి. ఉప్పువారు మొదటినుండియు నచ్చటనే యుండిరి. కానివారి కన్నంభొట్లవారితో నంత యైకమత్యములేదు. ఉప్పు వారికిని మనపప్పువారికిని నతికినట్లంన్నంభొట్లవారితో నతకదు. ఉప్పువారికిఁ బంధుమిత్రులకుఁ గూడ నెక్కువ కలయిక నుండెను. గొల్లప్రోలునుండి చల్లావారు మొదట నేకారణముచేతనో రాక కడపట విచ్చేసిరి. కడపట విచ్చేసినను మొదటినుండియు నన్నంభొట్లవారి కాప్తులగుట చేత వారి సమాగమెంతో రసవంతముగ నుండెను. ఉభయులకర్చులు పాపయ్యయె వహించుటచేత నన్నప్పగారు పుచ్చుకొన్న పండ్రెండువందల రూపాయలలో జిల్లిగవ్వయైన వ్యయము కాలేదు. కాక కాక యైన వివాహమగుటచేఁ