పుట:Ganapati (novel).pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

55

పెట్టిన భిక్షమె. పై రెండు వృత్తులవల్ల పాపయ్య నెలకువందల కొలది రూపాయ లార్జించెను. కాని యది యంతయు నిలిచినది కాదు. ఎంతచెట్టు కంతగాలి, అర్థప్రాణములు కవలపిల్లలు. అడుగడుగునఁ బ్రాణమున కెన్ని గండము లున్నవో యర్థమున కన్నిగండములె యున్నవి. పాపయ్య గొప్పదాత. అది వఱకు బ్రాహ్మణులు బ్రాహ్మణులకేగాని దాన మియ్యరని గొప్ప యప్రతిష్ట గలదు. ఆయప్రతిష్ట పాపయ్య తొలగించి శూద్రులకుఁ గూడ దానము లియ్యఁ జొచ్చెను. మగవారికి దానము లిచ్చుట మనలో బూర్వాచారము. ఆ యాచారమును మార్పుచేయఁదలఁచి యతఁ డాఁడువండ్రకె దానము లీయఁజొచ్చెను. కుంటివాండ్రకు గుడ్డివాండ్ర కేదేనివిదల్చుట యతని కిష్టములేదు. వారేదో ఘోరపాపముఁ జేయబట్టి భగవంతుడు వారిని దండించుటకై యంగవైకల్యము వారికి బ్రాప్తింపఁ జేయుటచే నట్టివారిని మనము డబ్బిచ్చి పోషించిన పక్షమున రాజద్రోహులను రక్షించిన వారిపై రాజునకుఁ గోపము వచ్చినట్లె యీశ్వరద్రోహులను రక్షించిన పక్షమున నీశ్వరునకు మనపైఁ గోపము వచ్చి మహానరకమున ద్రోయునని యతఁడు నమ్మి యటువంటివారి కేమియు సాయము చేయక రూపరేఖా విలాసములు గలిగి ప్రాయము గలిగి హొయలు గలవారికె నేవైన గుప్తదానములు చేయుచుండును. పాత్రదాన ప్రవీణుడైన పాపయ్య కతమున నెందఱో చాకలి సానులు, మంగలి మగువలు, గమళ్ళ గరితలు, నీడిగ