పుట:Ganapati (novel).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

గ ణ ప తి

దయలేక యమ్మించి లక్షాధికారులగువారి సొమ్ముకంటె నా సొమ్ము న్యాయమైనది. నాకొక్క గవ్వ నెవ్వరు నుచితముగ నీయనక్కరలేదు. నే నొకరిదగ్గరికివెళ్ళి చేయి జాచి యాచింపను. ఒకనియింటికి వెళ్ళి నింద్రుఁడవని చంద్రుఁడవని వానిని భూషించి వాని సమయగుదాక కని పెట్టుకొని యుండి పీకి పీడబెట్టి విసిగించి తిట్లుతిని నాలుగు డబ్బులు సంపాదించి సంతోషించు యాచకుని వృత్తికంటె నావృత్తి ఘనమైనది. వేదముఁ జదువుకొనలేదని శాస్త్రముఁ జదువుకొనలే దని నన్ను మీరు నిందించుచున్నారు. వేదము చదువుకొన్న వారి వృత్తి యేమిటి? ముష్టి. శాస్త్రమునేర్చి కొన్న వారి వృత్తి యేమిటి? ముష్టి. చదువుకొని ముష్టి యెత్తుటకంటె చదువుకొనక పీనుఁగుల మోయుట మంచిది. ఆ ముష్టి విద్యలు నాకక్కఱలేదు. ఒకరింటికి వెళ్ళనక్కఱలేదు. నా యింటి కందఱును వత్తురు. అందఱకు నాతో పనిగలదు. నేను కాలుమీఁద కాలువేసుకొని యింట్లో కూర్చుండి నప్పటికి నాయింటి కందఱువత్తురు. నావృత్తి వరహాలచెట్టు. ఎప్పటికప్పుడె పంట. ఇది నెల జీతముల వృత్తికాదు. అది వట్టిపాడువృత్తి. ముప్పది దినములు రాత్రియు బగలు పనిజేసి పదో యిరువదోరూపాయలను సంపాదించుట యేమి ప్రయోజకత్వమ? నన్నాక్షేపించువారిలోఁ గొందఱు యాచకులె. కొందరుపెద్దలు సంపాదించిపెట్టిన భూములమీఁద జీవించువారు. అటువంటి వారందఱు మనోవృత్తి ముండలు. తనభుజశక్తి మీఁద సంపా