పుట:Ganapati (novel).pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

47

వారిని వేవిధములుగ ధనమునిమిత్తము స్తోత్రములు చేసినను మనోరథము సిద్ధించలేదు. వివాహమునకు సొమ్ము ప్రోగుపడు నట్లు కనంబడలేదు. యాచనవల్ల దొరికినది సంభావనవల్ల నార్జించినది బ్రాహ్మణార్థములవల్ల చేఁజిక్కినది పాపయ్య పొగచుట్టలకుఁ దమలపాకులకు వక్కలకునడుమనడుమ నంగళ్ళకుఁబోయి కొని తిను లడ్డు బందరుఫేణి మొదలగు మధురాహారములకు సరిపోయెను. కాని మిగులుటలేదు. ఇంతదూరమువచ్చి వివాహము జేసికొనకుండ మరల స్వదేశమునకుఁ బోవుట యప్రతిష్ఠ యని యతఁడు భావించి తనవంటివారికి సొమ్ము చేతినిండ సమకూర్చునట్టి వృత్తినేదేని నవలంబింపవలయు నని సంకల్పించుకొనెను. అట్లు చేయుటలో నతఁ డొక క్రొత్తవృత్తి నారంభింపఁదలంచెను. ఒక నెల దినములు విచారించి యతడొక నిశ్చయమునకు వచ్చెను. ఆవృత్తి యాంధ్రుల కాశ్చర్యముగలిగించునట్టిది. మహారాష్ట్రులు మెచ్చునట్టిది. ఆపత్సమయమున నక్కఱకు వచ్చునట్టిది. ఎప్పటి కప్పుడు చేతిలో రొక్కము పడునట్టిది. అందఱకుఁ దనతోఁ బని గలిగించునది. ఏనుఁగు పాడివలె తరుగనిది. విరుగనిది. అట్టి యపూర్వమైన వృత్తి యేదందురా వినుఁడు. ఆంధ్రబ్రాహ్మణులు ముఖ్యముగ గౌతమీ కృష్ణవేణీ తీరవాసులు, నందు ముఖ్యముగ రామచిలుకలవలె గోఱవంకవలె నర్థము దెలియకుండ నొకరు చెప్పినదాని బండవల్లెవేసి స్వాధ్యాయము చెప్పుటకును శ్రౌతస్మార్త కర్మలు నిరాఘాటముగఁ జేయించుటకును కావ్యనాటకాలంకార గ్రంథములు