పుట:Ganapati (novel).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

గ ణ ప తి

శ్రీమంతులగు పీష్వాలు వారినిం బట్టి మహారాష్ట్రులందఱు ద్రిలింగదేశ బ్రాహ్మణుల నోటనుండి వేదమును వినవలయుననియు శ్రౌతస్మార్తాది కర్మలను జరిపించుకొనవలయుననియుఁ గుతూహలము గలిగియుండి యట్టివారు లభించినప్పుడు వారిని రావించి సకలవిధముల సమ్మానించి సకల పూజల సత్కరించి పంపుచుందురు. అందుచేత నాంధ్ర బ్రాహ్మణులలో స్వాధ్యాయవేత్తలు శ్రౌతస్మార్త ప్రయోగదక్షులు, శ్రీమంతుల కాలమునను శ్రీమంతుల రాజ్యమస్తమించిన వెనుకను గూడ పునహాసతారాలకుఁ బోవుచుందురు. అట్టి వేదవేత్తలు గర్మిష్టులుఁ బోవుచోటికి పొట్టకోసి కంచుకాగడాల వెదకినను నొక్కయక్షర ముక్కయైన గనబడని పాపయ్య యేమి చేయవలయునని వెళ్ళియుండెనోగదాయని యెల్లవారికి సందియము దోఁచక మానదు. ఘూర్జరులు మహారాష్ట్రులు మిక్కిలి దాతలనియు, గోదావరీతీర బ్రాహ్మణుడు వివాహార్థము యాచించినతోడనె రూకల వర్షము గురియుననియు నందువలన సులభముగ వివాహము జేసికొనవచ్చు ననియు నితరులవలన విని యతఁడు నమ్మెను. అదియునుగాక యాదేశమున శ్రాద్ధభోక్తకు సయుతము రూపాయకు తక్కువ దక్షిణనియ్యరనియు నందుచేత బ్రాహ్మణార్థములు చేసియె గోనెసంచెడు రూపాయలు సంపాదింప వచ్చుననియు నతని కాశపుట్టి వెళ్లెను. ఎట్టెటో యతఁడు పునహా జేరెను. చేరి సత్రములలో భోజన మారంభించెను. ఆవగాయ మాగాయ మొద