Jump to content

పుట:Ganapati (novel).pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

43

ధాని యైన పునహాకుఁ జేరెను. పునహాలోఁ పూర్వకాలమున బాజీరాయఁడు మొదలగు పీష్వాలు రాజ్యధురంధరులై యున్న కాలమున బ్రాహ్మణపూజ విశేషముగ జరుగుచుండెను. అందు వేదాధ్యయన సంపన్నులకు జరిగెడుపూజ మిక్కిలి మెండు. భరతఖండ మంతటిలోను కృష్ణా గోదావరీ తీరవాసులగు బ్రాహ్మణులు మిక్కిలి గంభీరముగ నుదాత్తానుదాత్త స్వరితస్వరములు తప్పకుండ నపశబ్దము రాకుండ స్వచ్ఛముగ మనోహరముగ వేదము చదువఁ గలరని మహారాష్ట్ర దేశమున గొప్పవాడుక గలదు. ఆ ప్రఖ్యాతి కాంధ్రబ్రాహ్మణులనుటకు సందియములేదు. హిందూదేశమున ననేకభాషలున్నను నందులో ననేకములు సంస్కృతములే మాతృకగ గ్రహించినను నాంధ్రభాషవలె నవి సర్వవిషయముల సంస్కృతము ననుసరింపలేక పోయినవి. అక్షరముల దగ్గఱనుండి తెలుఁగుభాష సంస్కృతము ననుసరించిన కారణమున నాంధ్రులు సంస్కృత శబ్దములను స్వచ్ఛముగ నిర్దుష్టముగ నుచ్చరింపఁగలరు. తక్కినవా రట్లుచ్చరింపలేరు. వంగదేశీయుఁడు వేద మనఁబోయి బేదమనును. సద్గుణ మనఁబోయి షద్గుణమనును. ఓఢ్రదేశీయుఁడు జనకుఁ డనుటకు జొనొకొ యనును. ఇట్లే ఘూర్జర మహారాష్ట్ర ద్రావిడకర్ణాటాదిభాషలు సంపూర్ణ భాషలుగామి నాయాదేశస్థుల నాలుకలు సంస్కృతోచ్చారణమునకు సరిగా నలవడి యుండలేదు. సంస్కృతోచ్చారణమున కాంధ్రులే దక్షులు. ఆ కారణంబున