పుట:Ganapati (novel).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

35

యజమానితోఁ దరుచుగాఁ దగవులాడుచుండును. ఇతఁడు కంఠమెత్తి కేక లారంభించెనా భూదేవతలెగాక శ్రాద్ధమునకు వచ్చిన విశ్వదేవతలు పితృదేవతలు గూడ గడగడ వణఁకి పారిపోవుదురని గ్రామస్థుల యభిప్రాయము. అది యటుండ నిమంత్రితుఁడై పాపయ్య శ్రాద్ధ భోజనముఁ జేసి వెళ్ళునపుడు గృహయజమానుల కన్నుబ్రామి యేదో వీలు చూచుకొని గిన్నెయొ పంచ పాత్రయె పట్టుకొని పోవును. శ్రాద్ధభోక్తల కుదకుంభదానముఁ చేయవలయునునని శాస్త్రమందుండినను సాధారణముగ నట్లెవ్వరుఁ జేయలేకపోవుటచే పితృకర్మలు చేయువారి కుదకుంభ దాన ఫలముం గల్పింపవలయునని పాపయ్య యేవో పాత్రలు పట్టుకొని పోవుచుండు నని పౌరబ్రాహ్మణులు తెలిసికొనలేక యతనిని భోక్తగఁ బిలుచుట మానుకొనిరి. పిలువకబోవుట కిదియె ప్రధాన కారణమని చెప్పవచ్చును. ఉపకారణము గూడ మరియొక టున్నది. అది చెప్పకపోవుట దోషము కావునఁ జెప్పఁబడుచున్నది. పాపయ్య గంభీరకాయుఁడు. ఆకారమునకు దగిన యాకలి. యాకలికి దగిన భోజన సౌష్టవము నతనియందుఁ గలవు. అగ్నిహోత్రమునందు సర్వము హుతమైనట్లె యతని జఠరాగ్నియం దేది వేసినను వెంటనే హుతమైపోవును. అదృష్టవశమున నట్టి గాఢ జీర్ణశక్తి యతనికిఁ గలిగినందుకు సంతసింపక గ్రామవాసులలోఁ కొందఱు విరోధముచేత గొంద ఱసూయచేతను “ప్రతి మనుష్యునకు