పుట:Ganapati (novel).pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

358

గ ణ ప తి

సలక్షణముగ జరిగెను. అప్పగింతలు, దండాడింపులు మొదలయినవి జరిగెను. గణపతి మహానందభరితుఁ డయ్యెను. పిల్ల పూర్వజన్మమున నిప్పులు పూజచేసిన దని కొందఱు, జిల్లేడు పువ్వులు పూజించినదని కొందఱు, దాని కేమి యిది మహాలక్ష్మిలా గున్నదియని కొందరు, బలు తెఱంగుల భాషింపజొచ్చిరి. ఇట్లు వివాహానంతరమున నాలుగు దినములు గడిచిన తరువాత నొకడు ముప్పది సంవత్సరముల వయసు గల యొక పడుచు బ్రాహ్మణుఁడు పోలీసు కనిస్టేబు నొకరిని వెంటబెట్టుకొని గణపతి యింటికి వచ్చి 'అతడే ముద్దాయి ' యని భైరవ దీక్షితులును జూపెను. కనిస్టేబులు భైరవదీక్షితులును బట్టుకొని "అయ్యా! నిన్నెఱస్టు చేసినా" నని చెప్పెను. పోలీసువారు పల్లెటూరు వచ్చినప్పుడు వానివెంట పదుగురుబడి యతఁడు చేయదలఁచిన కార్యము చూడబోదురు. అందుచేత నదివరకు కొందరు జనులక్కడ మూగిరి. వారిని జూచి మరి కొందరు జేరిరి. "నన్నెందులకు పట్టుకున్నా" రని దీక్షితులు రాజభటు నడిగెను. భటుఁడేమో చెప్పబోవుచుండగా వాని నూరకుండుమని నతినితోవచ్చిన పడుచు బ్రాహ్మణు డిట్లనియె. "అతడు కాదు నేను చెప్పుచున్నాను, విను. అయ్యా! పెద్దమనుష్యులు మీరందరుఁ గూడ చిత్తగించండి. ఈయన బ్ర్రాహ్మణుఁడండి. కాపుర మేయూరో తెలియదు. ఇప్పుడు పెండ్లియైన యీ పిల్ల తన కుమార్తె యని చెప్పి