పుట:Ganapati (novel).pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

351

చూడు తమాషా ! అని పిచ్చిముండై యెదురు నాకే పిచ్చియని లోకమున వెల్లడిచేసి యినపగుండ్లవంటి బండకుంకలను పదిమందిని పోగుచేసి కాలువరేవున నా బుఱ్ఱ గొరిగించి, నిమ్మపండ్ల పులుసుతో నా తల రుద్దించి, నీళ్ళు పోయించినది. ముందు దాని పిచ్చి మనము కుదుర్చవలెను. అది యిక్కడకు వచ్చుటలేదు. ఒరే! చిదంబరం నీవు వెళ్ళి మా యమ్మను సమాధాన పరచి కోపము దీర్చి మన యింటికి తీసికొనిరా, వచ్చిన తరువాత నాలుగురోజులు చూచి దాని పిచ్చి మనము కుదిర్చివేతుము" అని చెప్ప వెంటనే చిదంబరము తల్లికడకు బోయి సామవాక్యములతో నామె యలుక దీర్చి యింటికి దోడ్కొని వచ్చెను. నాలుగురోజులు జరిగిన తరువాత నొకనాడు తెల్లవారుజాముననే మంగలిని గణపతి పిలుచుకొని వచ్చి నిద్దుర లేవక మునుపే తల్లికి క్షౌరము చేయుమని చెప్పెను. మంగలి మొదట సందేహించెను. కాని "మా యమ్మ పిచ్చిది, మే మిప్పుడు ఆమెకు నీళ్ళు పోయవలెను. గనుక సందేహింపక పనిచేయరా!" యని యతఁడు హెచ్చరింప క్షురకుఁడు వపన మారంభించెను. కత్తి తలకు తగలగానే యామె మేలుకొని కన్నులు తెరచి చూచి 'నీ కిదేమి వినాశ కాలమురా ' యని మంగలిని దిట్టి వానిచేయి బట్టుకొన బోవుచుండగా నంతలో గణపతియు విద్యార్థులు డగ్గరి కాలుచేతులు నొక్కిపెట్టిరి. ఆ నడుమ మంగలి ముండనము సమాప్తము చేసెను. ఆమెయు నిట్టటు గింజుకొనుటచే రెండుమూడు