పుట:Ganapati (novel).pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

348

గ ణ ప తి

పగలంతయు నిద్రపోయి సంధ్యాకాలమున మేల్కొని యపుడు దంతధావనము చేసి భుజించి, కడచిన రాత్రి జరిగిన యూరేగింపునుగూర్చి విద్యార్థులతో గొంత ప్రసంగించి మరల పండుకొని మరునాడు జాము ప్రొద్దెక్కిన తరువాత లేచెను. అది మొదలుకొని పది దినములవరకు కనబడిన వారితో తన యూరేగింపు యుత్సవమునుగూర్చి మాటలాడుచు, బాగున్నదని యెల్లవారును బ్రశంసింప నమితానందమునొందుచు, తన్మయత్వము చెంది సుఖించుచుండెను. కాని తల్లి కుమారుఁడు భోజనము చేయునప్పుడు వాని వివాహ ప్రసంగము తలపెట్టుట మానలేదు. ఏదో తప్పుపట్టి గణపతి యామెను మొట్టుట కొట్టుట మానలేదు. ఆ బాధ పడలేక యామె యిరుగు పొరుగు నున్న మగవాండ్రతో మొఱ్ఱ పెట్టుకొనగా వారు గణపతికి పిచ్చి పట్టినదనియుఁ దలమీఁద గత్తివాటులు వేయించి నిమ్మపండ్ల పులుసుతో రుద్ది, వందబిందెల నీళ్ళు పోసిన గాని యా పిచ్చి కుదుర దనిఁయుఁ జెప్పిరి. "బాధపడలేక పోవుచున్నాను, నాయనా! యాలాగే చేయుం" డని యామె బదులు చెప్పెను. మరునాఁ డుదయమున గణపతి నిద్ర మేల్కొనక మునుపే వాని పూర్వ విద్యార్థులు ఆ మెరియలవంటివాండ్రనమండ్రు వచ్చి తల్లితో మాటలాడి, గణపతి మేలుకొనువరకు నక్కడ కూర్చుండి యాతఁడు మేల్కొన్న పిదప "పంతులు గారూ! కాలువకు వెళ్ళి స్నానము చేయుదము, రండి!" యని యడిగిరి. సరేయని యతఁడు బయలుదేరెను. వారొక మంగలివానిని గూడవెంట దీసుకొని పోయిరి. అక్కడకు వెళ్ళిన తరువాత