పుట:Ganapati (novel).pdf/348

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

347

త్సవములకు గాని జమ్మిసవారీకి గాని గురు స్వాములవారు వచ్చినప్పుడు కాని దేశోద్ధారకులైన మహానుభావులు వచ్చినప్పుడు గాని యంతజన మెన్నడును బయలు దేఱి యుండరు. తన స్నేహితుల యిండ్లముందఱికి బల్లకి వెళ్ళినప్పుడు గణపతి చేసన్న చేసి పిలిచి "ఓరీ! యుత్సవ మేలాగున్నది? నేను జమాయించి గూర్చున్నానా? పెండ్లి కొడుకులా గున్నానా?" యని యడుగుచుండును. "పెండ్లికొడుకు బాబులా గున్నావురా! నీలాటి పెండ్లికొడుకు లేడురా, లోకములో!" నని హాస్యాస్పదముగ వారు ప్రత్యుత్తర మీయ నతఁడు దానిభావము గ్రహింపలేక తనవంటి పెండ్లికొడుకులు లోకమున లేరని యానందించెను. తన యుత్సవ మగుటచేత గణపతి యా రాత్రి నిదురపోవలేదు. ఏమియు దోఁచనపుడు చుట్ట వెలిగించి యీ ప్రక్క నా ప్రక్కనున్న కాగడావాండ్ర మీఁదను స్నేహితులమీఁదను నుమియ జొచ్చెను. ఆ మహోత్సవ పారవశ్యమున వా రా యవమానము సరకుగొనరైరి. ఆ సమయమున నతని తిట్లు దీవన లయ్యెను. ఉమ్ములు పుష్పవర్షము లయ్యెను. జాము తెల్లవారునప్పటికి ఉత్సవము సమాప్తమయ్యెను. గణపతి పల్లకి దిగి యింటిగుమ్మములో నడుగు పెట్టగానే సింగమ్మ గుప్పెడు మిరపకాయలు దిగదుడిచి, తన్నిమిత్త మారిపోకుండ జాగ్రత్తపెట్టిన పొయినిప్పులో పడవైచి, కుమారునకు దృష్టిదోష పరిహారము చేసెను. పల్లకి దిగి గణపతి పండుకొని మరునాడు