పుట:Ganapati (novel).pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

346

గ ణ ప తి

చేయుదుమని చెప్పి గురువుగారికి దుఃఖోపశమనము చేసిరి. ఆ రాత్రి వానపల్లి గ్రామవాసులనుభవించిన యానంద మేమని వర్ణింతును? ఉత్సవములో నెంత తిరిగినను వారికి విసుగు జనింపలేదు. కాళ్ళు నొప్పులు పెట్టలేదు. ఆయాస మనిపించలేదు. ఎందుచేత ననగా మన గణపతి తనచేష్టలచేత, నాసనములచేత, చూపులచేత మఱి యితర చిహ్నములచేత, క్షణ క్షణము వారికి క్రొత్త యానందము గల్పించుచు వచ్చెను. ఒకమాఱు వెనుకనున్న బాలీసుకు జేరబడును. ఒక మాఱు పండుకొనును. ఒకసారి ముందఱికి వంగును. ఒకతూఱి బాసెనపట్టు వేసికొనును. ఒకపరి కాళ్ళు జాపుకొనును. ఒకసారి రెడ్డికము వైచికొనును. ఒకసారి కన్నులు మూసికొనును. ఒకసారి పెద్దగ్రుడ్లు చేయును. మఱియొకతూఱి యోరచూపులఁ జూచును. ఒకసారి చప్పట్లు వాయించి తానే గానము చేయును. కాగడాలు పల్లకికి దూరమైనప్పుడు కాగడాలు పట్టువారిని గట్టిగా తిట్టి దగ్గఱకు రమ్మనుచు, ఇంటింటి దగ్గఱ పల్లకి యాపించును. వారే కారణము చేతనైన నాగకపోయిన పక్షమున బిగ్గఱగ నఱచి యాపించును. ఒకసారి భజంత్రీలు సరిగా మేళము చేయకపోగా మేళము చేయింపు మని యతఁ డొకరిద్దరితో జెప్పెను. వారా మాట వినిపించికొన నందున గుభాలున తానే పల్లకిలో నుండి క్రింది కురికి భజంత్రీలను నాలుగు చెంపకాయలు కొట్టి మరల పల్లకి యెక్కెను. కూడనున్న జనులలో నవ్వని వారు లేరు. దేవతో