పుట:Ganapati (novel).pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

342

గ ణ ప తి

చూచి గడుసువాండ్రగు పాత విద్యార్థులు కొందరు గణపతిని తమ వినోదము నిమిత్త ముపయోగించుకొనవలెనని యాలోచించి తమలో తా మొక పన్నుగడ పన్నుకొని యొక నా డతనితో నిట్లనిరి. "పంతులుగారూ! మీకు వివాహము చేయవలెనని మాకందరకు గట్టిగా మనసులో నున్నది. కాని కొందరు గణపతిగారికి పిచ్చి యెత్తిన దనియు, మీరు తిన్నగా పల్లకీలో గూర్చుండ లేరనియు, మీకు బుద్ధినిలకడ లేదనియు మీమీద లేనిపోని వాడుకలు వైచినారు. ఆందుచేత మేమీ రాత్రి పల్లకీ భజంత్రీమేళము రెండుమూడు కాగడాలు తెప్పించెదము. మీరు పల్లకీలో కూర్చుండి, పెండ్లికొడుకు ఠీవి కనబరచవలెను. ఆలాగున మీరు చేసినపక్షమున మీరు వివాహమునకు దగిన వారే యని, మీకు వెఱ్ఱిలేదని గ్రామవాసులు నమ్మి, చందాలువేసి మీకు వివాహము జేయుదురు. మీరు మాకు చదువు చెప్పి మమ్మెంతో బాగుచేసినారు గనుక విశ్వాసముచేత మిమ్మొక యింటివారిని జేయవలెనని మా కందఱకు దోచినది. పల్లకిలో గూర్చుండుట మీ కిష్టమేనా?" పల్లకీపేరు చెప్పగానే గణపతి పరవశుఁడయ్యెను. వెనుక బుచ్చమ్మ పెండ్లి మిక్కిలి రహస్యముగ జరుగుటచే బహిరంగముగా బల్లకి యెక్కి యూరేగుట కతనికవకాశము లేకపోయెను. వివాహమైనప్పుడు తీరవలసిన ముచ్చట వివాహము కానప్పుడు తీరుట తనకు శుభసూచక మని తప్పక యటమీఁద నిఁక వివాహ మగునని యతఁడు నిశ్చయించి