పుట:Ganapati (novel).pdf/342

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

341

యూరకుండదు. ఆడది, పెద్దది, విశేషించి తల్లి, యామె యెట్లు పాడుకొనిన మన కెందుకని గణపతి యూరకుండఁడు. ఈ విధముగ నామె పాడుచుండుట నామెకు బుత్రదండనము జరుగుచుండుట ప్రాయికమయ్యెను. శంకరుని కుమారుఁడైన గణపతి యొక్క పురాణము జనులు వినాయక చతుర్థినాడె విందురు గాని యీ గణపతి పురాణమును ప్రతిదినము వినుచుండిరి. దినమున కొక క్రొత్తవింత బయలుదేరు చుండెను. రాత్రి భోజనము లైన తరువాత గ్రామవాసు లరుగుమీఁద గూర్చున్నపుడు ప్రాతఃకాలమున దంతధావనార్థము నలుగురు చెరువు గట్టు చేరినప్పుడు "యేమిటోయి గణపతి విశేషము?" లని యొండొరుల నడుగు చుందురు. ఎవరో కొన్ని క్రొత్త వింతలు చెప్పుచుందురు. అక్కడ చేరినవారందరు మితిమీఱ నవ్వి "మన యదృష్టముచేత గణపతి మన గ్రామమనున నివసించె" నని పలుకుచుందురు. వివాహము మాట తలపెట్టినపుడు, పాట పాడుకొన్నప్పుడు, కొడుకేదో వంకబెట్టి తన్ను కొట్టుచుండుటచేత సింగమ్మ కొడుకున కెవరైన చేతపడి చేసిరో లేక పిచ్చి యెత్తెనో యని యిరుగు పొరుగు కాంతలతో నాలోచింపఁ బోయెను. కొందరు దయ్యమనిరి, కొందరు పిచ్చియనిరి. గణపతి తల్లితోనే గాక తన వివాహముమాట యెత్తి తన కాస్తి లేదన్న వారందరితోను తగవులాడు చుండుటచే గ్రామవాసులలోఁ గొందరుకూడ యతనికిఁ బెండ్లి పిచ్చియెత్తినదని తలంచిరి. ఈతని వికృత చేష్టలు