పుట:Ganapati (novel).pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

336

గ ణ ప తి

ఎంతమందో వంట బ్రాహ్మణులకు, నీళ్ళ బ్రాహ్మణులకు, దెలివి తేటలు లేనివాళ్ళకు యిట్టే పెండ్లిం డ్లగుచున్నవి. నా కర్మ మేమో కాని మావాడికి పిల్లనిచ్చుట కెవ్వరు రారు. కులము తక్కువా? గోత్రము తక్కువా? మేమేమి కుక్కను దిన్నామా? నా బిడ్డ పదిమందిలో తిరుగలేనివాడా? డబ్బు తెచ్చుకోలేనివాడా? మీ రందరు తలో పదిరూపాయలు చందా వేసి మా వాడికి పెండ్లి చేయండమ్మా. మా కిన్ని యేండ్ల పిల్ల కావలెను, అన్ని యేండ్ల పిల్ల కావలెను, అని పట్టింపులేదు. ఎన్ని యేండ్ల పిల్లయినను సరే. చివరకు రెండు మూడు నెలల పిల్లయినా సరే. అమ్మా! వానికి పాతిగేండ్ల కంటె నెక్కువ లేవు. ఇదొక వయస్సా? మావాడి కిప్పటికి కట్టు తప్పిపోలేదు." అని చెప్పుచుండ నామె పుత్ర స్నేహమునకు, వెంగలితనమునకు వారు మిక్కిలి విస్మితులై నవ్వుచు "సింగమ్మవ్వా! అలాగే పెండ్లి కుదర్చండి. మాకు తోచిన సహాయము మేము చేయుదు మని యుత్తరము చెప్పుచు వచ్చిరి. ఆమె కొడుకుం గలసికొన్నను, చుట్టములఁ జూచినను, చుట్టుప్రక్కల సుదతుల గనుగొనినను, బెండ్లిమాటయె కాని మఱియొక ప్రసంగము చేయుట మానెను. అన్యప్రసంగములు వచ్చినను నామె యెట్టకేల కీ ప్రసంగముననే దింపును. బడిపిల్లలతోను బాటసారులతోను బంధువులతోను గ్రామవాసులైన కరణములతోను కాపులతోను గణపతి తన వివాహప్రసంగమే చేయజొచ్చెను. తన శాఖలో నెవనియొద్ద