పుట:Ganapati (novel).pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియవ ప్రకరణము

తనకు వివాహము కాలేదని, యందువలన సాటివారిలో దనకు చిన్నతనము గలుచున్న దని, కష్టపడి చేసుకొన్న పెండ్లి చెడిపోయిన దని, కొంతకాలమునుండి గణపతి మనస్సులో విచారించుచుండెను. అతఁడు కట్టిన పుస్తె త్రెంచివైచి బుచ్చమ్మకు దండ్రి మరల పెండ్లిచేసెను. ఆ వార్త విన్నది మొదలుకొని మరల కష్టపడి తా నెట్లయిన వివాహము చేసికొని మేనమామ యొద్దకుబోయి "యీ పాడుపిల్ల నాకు తప్పిపోయినంత మాత్రమున నాకు వివాహము కాదనుకున్నారా? దీ నబ్బవంటి పిల్లను చేసికొన్నాను, చూడండి!" యని వారిని దెప్పవలెనని గణపతి మనస్సులో నిశ్చయించుకొని పెండ్లికూతురు నిమిత్తమై వెదకజొచ్చెను. తల్లి సింగమ్మయు దన కొడుకు ఘోటకబ్రహ్మచారియై యుండినా డనియు, బ్రసిద్ధమైన పప్పుభొట్లవారి వంశము వానితో నంతమొందు ననియుఁ దన మగనికి మామగారికి వారి పూర్వులకు సద్గతు లుండవనియు మిక్కిలి విచారించి, యిరుగు పొరుగు స్త్రీలు కనఁబడినపు డెల్ల నిట్లనుచుండును. " అమ్మా! మీ రంద రభిమానించుకొని మా గణపతి నొక యింటివానిని జేయరుగద. వాని మెడలో నాలుగు పోగులు పడే దారి చూతురమ్మా! మీకు బహుపుణ్య ముంటుంది.