పుట:Ganapati (novel).pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

334

గ ణ ప తి

నాయనా! అది చుట్టమా? పక్కమా? కోడికోసమల్లా యేడువవచ్చునట్రా?" యని మందలించెను. ఆ పలుకులు వినగనే యతఁ డాగ్రహావిష్టుడై తాటియాకుల మంటవలె లేచి "దిక్కుమాలిన ముండా! నా కోడికి నీ దృష్టే తగిలిందే ముండా! దానిని చూచినప్పు డెల్ల నీ కన్నులలో నిప్పులు పోసికొన్నావు. నీ మూలమున నిక్షేపమువంటి కోడపెట్టె పోయినదే ముండా! నా యిల్లు చిన్నబోయి వల్ల కాడు లాగున్నదే ముండా! నీ కన్ను లిప్పుడు చల్లగా నున్నాయటే, ముండా!" యని కోప మాపుకొనలేక యామెకడకుఁ బోయి బుఱ్ఱవంగదీసి పదిచఱపులు వైచెను. "నీ కేమి చేటుకాలము వచ్చినదిరా? నే నేమి జేసినానని నన్ను కొట్టుచున్నా" వని యామె యేడ్చుచు లోపలికి బోయెను. ఆ రాత్రి యతడు దుఃఖముచేత సరిగా నన్నమే తినలేదు. జన్మమధ్యమున నతనికి సరిగా నిద్రపట్టని రాత్రి యదియె. తెల్లవారుజామున నెన్నడులేని దతనికి మెలకువ రాగా "యీ పాటికి లేచి కూసేదానవే. నీ కూతలు నాకు సంగీతములా గుండేవి. నేనెంత దిక్కుమాలినవాడనైతినే! నీవు లేకపోవుటచేత యిల్లు బావురుమని పోయిందే! నీవు చచ్చిపోయినావు కాని మా తల్లి ముండైనా చచ్చిపోయినదికాదే!" అని పరిపరి విధముల దుఃఖించెను. ఆ మరునాటినుండియు మఱియొక కోడికొఱకు ప్రయత్నము చేయదొడగెను, కాని యది లభించినదికాదు.