పుట:Ganapati (novel).pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

333

దులలో కథలు చెప్పుకొనినట్లు యాగ్రామవాసులు, సమీప గ్రామవాసులును వాని చరిత్రము జెప్పుకొని కడుపులు పగులునట్లు నవ్వుచుందురు. ఎప్పటి గ్రుడ్లప్పుడు గణపతి ఖర్చు నిమిత్త మమ్మివేయుచుండును. కాని కోడి పొదిగి వాటిని పిల్లలు జేయువఱకు నోపిక పట్టలేకపోయెను. అట్లుండఁగా నొకనా డాకుక్కుటము మిక్కుటమైన సంతోషముతో దొడ్డిలో దిరుగుచు నక్కడక్కడ రాలిన గింజలు చెదపురుగులు మొదలైనవాని నేరుకొని తినుచుఁ దిరుగు చుండగాఁ నేమూలనుండియొ నొక గండుపిల్లి వచ్చి దానిం బట్టుకొని గొంతుకొరికి చంపెను. చంపిన తరువాత లోపలినుండి గణపతియు బడిపిల్లలు వచ్చిరి. కార్యము మించి పోయిన తరువాత వచ్చి యేమి చేయగలరు? అప్పుడు గణపతి పడిన దుఃఖపు వర్ణన దుస్సాధ్యమైనను గొన్ని మాటలైన వ్రాయక పోవుట చరిత్రమునకు వెలితి యగును. కావున నించుక చెప్పదలంచితిమి. 'అయ్యో! నాకోడీ! నానల్లకోడీ! నా పాలిటి బంగారు గని ననుకొన్నానే, నిన్ను! నీ కడుపున పుట్టిన పుంజుల చేత పందెములు వేయించి నాలుగైదు వందలు సంపాదించి పెండ్లి చేసుకుందా మనుకున్నానే ! నీవంటి బంగారు బొజ్జగల కోడి నావంటి నిర్భాగ్యునకు దక్కునటే! నీకెంత ముద్దుగా తౌడు పెట్టుకొన్నానే! భుజముమీద ఎక్కించుకొని త్రిప్పినానే, రాత్రులు నా ప్రక్కలో బండుకొనేదానవే, ఇక నేనొక్కడ నేలాగున పడుకోగలనే ఈమాయ పిల్లెక్కడ వచ్చిందే నీ ప్రాణమునకు." అని దుఃఖించుచుండ సింగమ్మ యతని కడకుఁ బోయి "యయ్యో