పుట:Ganapati (novel).pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

332

గ ణ ప తి

వారా ప్రయత్నము మానుకొనిరి. కోడిమాత్రమె యింట మిగిలెను. గణపతి బడిపిల్ల లందరు జూచుచుండగను, వారు లేనప్పుడును కోడిని యొడిలో బెట్టుకొని చేతితో జోకొట్టుచు 'నా బుల్లికోడి రావే! నా బుచ్చికోడి రావే! నా వెఱ్ఱికోడి రావే!' యని ముద్దులాడుచుండును. తల్లి సింగమ్మ కుమారుఁడు చేయు కుక్కుటసంరక్షణ మెంతమాత్రము సహింపక 'కొంప మాలపల్లి చేసినావురా, యాయనా! నీ కోడి మండిపోను! దీని యీకెలు రెట్టలు యెత్తిపోయలేక చచ్చిపోవు చున్నాను. బ్రాహ్మణులకు కోడి యెందుకురా? నీముద్దు ముక్కలైపోనూ!" యని పలుమారు మందలించుచుండెను. అవి యెంతమాత్రము వాని తల కెక్కలేదు. మహారాజుల యతఃపురాంగనలు చిలుకలను రాయంచలను మిక్కిలి గారాబమునం బెంచుచు నెత్తుకొని ముద్దాడుచు నానందించునట్లె గణపతియు నెందఱు చెప్పినను వినక యా కోడి తన కారవప్రాణ మనియు దనపాలిటి లక్ష్మి యనియు నమ్మి దానికే వెలితి రాకుండ వేవిధముల గనిపెట్టుచుండును. గ్రామ వాసులలో ననేకు లతఁడు కోడినెత్తుకొని ముద్దాడు సమయమున నక్కడకు బోయి, వాని మాటలు ముఖవైఖరులును బరీక్షించి వినోదముతో బ్రొద్దుపుచ్చు చుందురు. అప్పు డప్పుడా కోడి గ్రుడ్లు పోవుచుండును. దొంగిలించిన బాలుని గనుగొన లేక గణపతి బడిపిల్ల లందఱి వీపులమీఁద నీతబెత్తములతో బాజాలు వాయించుచుండును. రామాయణ భారత భాగవతా