పుట:Ganapati (novel).pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

327

ఆ వార్త యప్పుడె గ్రామమున బొక్కెను. సూర్యోదయ మగు నప్పటికె గ్రామమునందలి పిన్న పెద్దలు నా వింత జూచుటకై యచ్చోటికిం జనిరి. నవ్వినవారు నవ్విరి. వెక్కిరించినవారు వెక్కిరించిరి. పరిహాసగర్భమున నతని బుద్ధి మెచ్చినవారు మెచ్చిరి. అంద రన్ని విధములు ననుచుండ మహాదేవశాస్త్రి గణపతి తల్లితో నిట్లనియెను. "సింగమ్మప్పా! నీ కొడుకు పిల్లి బ్రహ్మహత్య చేసి నాఁడు. కుక్కను చంపిన పాపము గుడికట్టి నప్పటికి బోదు. పిల్లిని చంపిన పాపము బంగారు పిల్లిని చేసి బ్రాహ్మణునకు దాన మిచ్చిన గాని పోదు. అట్లు చేయకపోతే వంశనాశన మని పెద్దలు చెప్పుచున్నారు. ఆనక నీ యిష్టము. నీ మేలు కోరినవాడను గనుక నిజ స్థితి జెప్పినాను. "అనవుడు సింగమ్మ గుండె బాదుకొని "అయ్యో! నాయనా! ఎంతపని జరిగిందిరా! నీ కొబ్బరిచెట్లు కూలిపోను. మీ కాయలు గంగపాలు గాను. ఈ మాయపిల్లలు మా వాడి మతి విఱిచి యీ పని చేయించినారమ్మా. అయ్యకొడుకా! నీవు బ్రతకవు కాబోలునురా, నాయనా!" యని కొడుకును గౌగిలించుకొని యేడ్చెను. అందులోఁ గొందఱు "అవ్వగారూ! భయపడకండి. మే మందరమూ చందా వేసికొని బంగారుపిల్లి చేయించి మీ యబ్బాయిచేత దానము చేయించెదమని ధైర్యము జెప్పిరి. అంతటితో గణపతి మనస్సు, తల్లి మనస్సు స్థిమితపడెను. మహాదేవశాస్త్రి యా రాత్రి మరల గణపతి గృహమున కరిగి తల్లి