పుట:Ganapati (novel).pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

326

గ ణ ప తి

నచ్చలేదు. ఎట్టకేల కతనికి గొప్పయాలోచన యొకటి పొడకట్టెను. అది యమోఘ మని యతడు తలంచెను. ఒకనాడు సకల గృహవర్తియగు మార్జాలచక్రవర్తిని బట్టుకొని దాని నొక బుట్టలో బెట్టి శిష్యు నొకనిం బిలిచి చెట్టెక్కించి మరియొక శిష్యునిచేత పై నున్న వాని కా పిల్లి నందియ్యమని చెప్పెను. అతఁడ ట్లందిచ్చెను. పై వాడు పిల్లి నందుకొనిన తరువాత దాని మెడ కొక త్రాడు బోసి యా త్రాడు కొమ్మకు కట్టివేయ మని గణపతి చెప్పెను. శిష్యుఁడు గురుని యాజ్ఞ ప్రకారము గావించి క్రిందికి దిగెను. అప్పుడు గణపతి శిష్యులతో నిట్లనియె. 'ఈ సారి యెలుకలు చచ్చిపోయినవి. వీటి మొగం మండ! కొబ్బరికాయ యొక్క టైన దక్కకుండ వాటిపొట్టం బెట్టుకొనుచున్నవి. ఈ గ్రామములోని వారందరు నావలెనే యెలుకలబాధ పడుచున్నారు. కాని మందమతిముండాకొడుకులు నావలెనొక్కఁడైన యాలోచన చేయలేక పోయినాఁడు తెలివితేట లుండవలెను. కాని యేళ్ళుండఁగానే సరా. డబ్బుండఁగానే సరా!' ఆ కోతలు విని శిష్యులానందించిరి. అప్పటికి సాయంకాలమయ్యెను. గణపతి భోజనముచేసి నిద్రించెను. తన బిడాల మెన్ని యెలుకలనుబట్టి రాత్రి చంపెనో చూడగోరి గణపతి చెట్టుదగ్గరకుఁ బోయి మెడయెత్తి చూచునప్పటికి పిల్లి మెడకా త్రాడు యురిపడ చచ్చి యురి స్తంభముల వ్రేలాడు నేరస్తుని వలె వ్రేలుచుండెను. అది యేమైనదో చూచుటకై శిష్యులు చేరి యా బిడాలము యొక్క దుర్దశ జూచి జాలి నొందిరి.