పుట:Ganapati (novel).pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

324

గ ణ ప తి

మీ యాడవాళ్ళు చేసినప్పుడు మాత్రము వంట యెప్పుడైన చెడిపోదా ? మీకింత యోపిక లేదన్నమాట మొదటే తెలిసిన పక్షమున మీ దగ్గరకు నేను రాకపోదును. పోనియ్యండి. యేలుట కూళ్ళు లేవు గాని ముష్టి యెత్తుకొని తినుట కూళ్ళు లేవా? మీ వంటివారు నాకు వేయిమంది; నా వంటివాళ్ళు మీకు వేయిమంది. నీ మీ దగ్గర నెలదినములు పనిచేసినాను. నా జీతమీయండి. మీ దగ్గర పనిచేయడము నాకే యప్రతిష్ట' యని చివాలున లేచి తన గుడ్డలు నాలుగు మూట గట్టుకొని పయనమయ్యెను. ఆ యజమానుఁడు వాని మాటల కలుగక వాఁడొక యున్మత్తుఁ డనుకొని రెండు రూపాయాలు వాని చేతిలో బెట్టి " నీకు నెలకు నాలుగురూపాయ లియ్య దలఁచుకొన్నాను. కాని నీ తెలివికి రెండు రూపాయలు చాలును. పో!" యని చెప్పెను. "పోనీయండి. నా సొమ్మెంత మంది తినలేదు, అందులో మీరొకరు!' యని యా రెండురూపాయలు బుచ్చుకొని విసవిస నడచి పోయెను. ఆ యుద్యోగస్థుఁ డాపూట భోజనము లభింపమి యరటిపండ్లు తెప్పించుకొని తిని యొక విధముగా క్షుద్భాద తీర్చికొని సాయంకాల మాయూరు కరణముగారి యింటికిబోయి తన యవస్థ జెప్పుకొని యక్కడ భోజనము చేసెను.