పుట:Ganapati (novel).pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

323

చూచిన తరువాత యజమానునకు దుఃఖము కోపము నొక్కసారిగా రాఁగా నిట్లనియెను. 'హా! హా! హా! నీ వంట యమృతమువలె నున్నదిరా! నలపాక భీమపాకము లన యీ వఱకు లోకమున నున్నవి. కాని మా కర్మపాకము చేతనో దైవ దుర్విపాకముచేతనో గణపతిపాకమని మూడవ పాకము వచ్చినది. విరోధముచేత నెవఁడైన మరియొకని జంపఁ దలఁచు కొన్నపుడు నాభి పాషాణము మొదలయిన విషములు పెట్టనక్కఱలేదు. నీ చేత నొక్కసారి యన్నము వండి పెట్టించిన జాలు ఏబది సంవత్సరములు బ్రతుకదలంచిన వాఁడా పూట జచ్చును. ఉదయమున నే నేమియుఁ దినకుండ గుఱ్ఱమెక్కి యెంతో దూరము తిరిగి బడలి మిక్కిలి యాకఁలిగొని యింత మృష్టాన్నము నీవు వండి సిద్ధముగా నుంచుదు వని గంపంత యాసతో వచ్చినందుకు అన్నము పెట్టుటకు మారు నీవు సున్నము పెట్టితివి. నీ వంట మండిపోనూ. ఇఁక చాలు! నన్ను చంపక నీ దారిని నీవు వెళ్ళు, నాయనా ! మీ పెద్దలకు వేయి నమస్కారములు!' అనవుడు గణపతి చిన్నవోయి 'వంటెందుకు బాగులేదో నేనెరుగను. ఇది మీ వాళ్ళు నేర్పిన వంటే. నా వల్ల వచ్చిన లోప మొక్కటి. గరిటె మరచిపోయినాను అన్నమీ పుల్లతో గలియబెట్టినాను. ఇది వేపపుల్ల యేమో తెలియదు. అయితేమాత్రమేమి? వేపపుల్లతో మొగము కడిగికొనమా? వేపపువ్వు తినమా ? అన్నము చేదైన మాత్రమున నింత యల్లరి చేయవలెనా?