పుట:Ganapati (novel).pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

313

నిజముగాఁ దానా మేళనాయకురాలికిఁ బ్రాణనాయకుండె యనుకొని యపారమైన సంతోషము నొందెను. సత్యభామ తన్ను వరించునని తెలిసినప్పుడు శ్రీకృష్ణు డంత యానందము నొందెనో లేదో మనము జెప్పజాలము. ఆ దినమున నతని మనంబునం గలిగిన గర్వము వర్ణనాతీతమై యుండును. గరుడాచలము బసనుండి యింటికి వచ్చి ప్రాతశిష్యులను గొందరిని గ్రామవాసులలోఁ గొందరిని గలిసికొని మీసము మీఁదఁ జేయివైచి రెండు, మూడు సారులు సకిలించి కోరచూపు చూచుచు నిట్లనియె!" చూడుడి నా తమాషా! మీ యూరివారు నా తెలివి, నా తేట, నా మంచితనము, నా యోగ్యత విచారించకుండఁ దమ పిల్లలకు నేను విద్యాబుద్ధులు చెప్పి బాగుచేసినందకు విశ్వాసమైన లేకుండ నిష్కారణముగా మరియొక పంతులును బిలుచుకొనివచ్చి పోటీగా బడి పెట్టించినారు. వెధవబడి ! వెధవబడి! నా బడిపోతే యెంత, ఉంటే యెంత? ఇంతకంటె నెక్కువ పని సంపాదించినాను. గరుడాచలము తన భాగవతములో శ్రీకృష్ణవేషము వేయుమని నన్ను బ్రతిమాలినది. దాని మాట తీసివేయలేక నేను సరే యని వప్పుకొంటిని. చూడండి! యెటువంటి గౌరవమైన పని సంపాదించినానో, గరుడాచలమంటే యేమనుకొన్నారు? దేశదేశాల పేరు మ్రోగిన యాటకత్తె. అది భామవేషం కట్టితే చూచినవారు మూర్ఛపోవలెను. అది పాడితే ఆదిశేషు డాలకించవలెను. దాని భాగవతంలో కృష్ణవేషం కట్టడమంటే తహసిల్ దారీపని చేయడ మన్నమాట.