పుట:Ganapati (novel).pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312

గ ణ ప తి

జన్మము ధన్యమగుటయే గాక తన పితృమాతృవంశములు గూడ జరితార్థము లగుననియుఁ దలంచి "కృష్ణవేషగాడు దొరికిన పక్షమున మీరేమి జీత మిత్తు" రని యడిగెను. "ఆటకు రెండు రూపాయలు చొప్పున నిత్తు" మని గరుడాచల ముత్తరము చెప్పెను. "నెల కెన్ని యాట లుండు" నని యతడు మరల నడిగెను. 'అది మన యదృష్టమును బట్టి యుండును. ఇన్నని వక్కాణించి చెప్పజాల ' నని యా వెలయాలు బదులు చెప్పెను. "నీకు శూద్రుడు కావలెనా? బ్రాహ్మణుడు కావలెనా? యని గణపతి వెండియుం బ్రశ్నింప "ఏమింత తరచి తరచి యడుగుచున్నారు. మీ కాపని గావలెనని యున్నదా!" యని వేశ్యమాతయైన వృద్ధాంగన యడిగెను. "ఔను, మీకంగీకార మైన పక్షమున నేనే కృష్ణవేషము వేయవలెనని యున్నది." యని యతఁడు త్తరము జెప్పెను. అతని వాలకము మాట తీరు చూచి యతఁ డాపని కక్కరకు రాడని పాపాచలము తలంచెను. గాని తమ మేళములో నతఁడుండుట వినోదకరముగా నుండి తమకుఁ బ్రొద్దుపుచ్చుననియు నవసరమై నప్పుడు నతనిచేఁ గృష్ణవేషముఁ గూడ వేయించవచ్చు ననియు గరుడాచల మాలోచించి "సరే ! మీరు మా మేళములో నుండవచ్చును. మీ బట్టలు మూఁటగట్టి తెచ్చి మాతో రండి" యని చెప్పెను. ఆ పలుకులు నిజముగా నతని మనస్సు మీఁద నమృతవర్షము గురిసినట్లయ్యెను. తాను కృష్ణవేషము ధరించుట గరుడాచలము సత్యభామవేషము ధరించుట దలంచుకొని గణపతి