పుట:Ganapati (novel).pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

గ ణ ప తి

వచ్చి దాహము త్రాగుటకయి లేవబోఁగా, దన జుట్టు పట్టుకొని యెవరో లాగినట్లయ్యెను. అప్పు డతఁడు మహాభయభ్రాంతుఁడై "చచ్చిపోయినానోయి, నాయనా ! దయ్యములు నా జుట్టు పట్టుకొని లాగుచున్నవిరోయి ! ఓ అమ్మా ? ఓ శాస్త్రిగారు ! చచ్చిపోయినాను, చచ్చిపోయినాను! రండోయి, రండోయి! రండోయి!" యని యుచ్చైస్వరముతో నరచెను. కొంటెతనము చేసిన విద్యార్థియు వానితోఁబాటు 'దయ్యాలు బాబో! దయ్యాలు ' అని యేడువఁజొచ్చెను. తక్కిన విద్యార్థులుగూడ నాఁటి కుట్రలోఁ జేరినవారె యుగుటంచేసి చకితస్వాంతులైన ట్లభినయించి గోల పెట్టె యేడ్చిరి. 'అయ్య కొడుకో! కొడుకో!' యని సింగమ్మ లోపలనుండి వచ్చెను. ఇంటిలో దీపము లారిపోయినందున సింగమ్మ నిద్రలోనుంచి యకస్మాత్తుగ లేచి గుమ్మ మెక్కడున్నదో యెరుఁగక గోడమీఁద బడి మొగమునకు దెబ్బ తగిలించుకొని దయ్యములే పడవేయుచున్న వని కొడుకు గతి యేమైనదో యని యేడ్వఁజొచ్చెను. ఇంతలో మహాదేవశాస్త్రి తన యడప సంచిదీసి చెకుముకిరాతితో నిప్పుచేసి దీపము వెలిగించి చూచునప్పటికి గణపతి జుట్టుకు ద్రాడుపోసి దూలమునకుఁ గట్టి యుండుట కనఁబడెను. అపు డాయన నిజస్థితి చెప్పి గణపతి భయ మడిసి యది యా శిష్యులలో నెవ్వరో చేసిన కొంటెతనమని గట్టిగాఁ జెప్పెను. అది దయ్యములు చేసిన పని గాని