పుట:Ganapati (novel).pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

304

గ ణ ప తి

పోవునట్లు, పిశాచాది పీడాపరిహార మగునట్లు మహాదేవశాస్త్రి విభూతి మంత్రించి గణపతి మొగమునిండ బొజ్జనిండ భుజముల నిండఁ బెట్టి శతగాయత్రీజపము జేసికొమ్మనెను. గణపతికి గాయత్రీ మంత్రము రాదన్న మాట మహాదేవశాస్త్రి యెరుఁగడు. అయినను గణపతి యా జపము చేసినట్లే యభినయించెను. ఆనాఁడు మహాదేవశాస్త్రిగారి యిల్లు కోటిపల్లె తీర్థమువలె నుండెను. స్మశానభూమికి గ్రామమునం గల మగవారే వెళ్ళిరి గాని స్త్రీలు శిశువులు మొదలగువారు వెళ్ళకపోవుటంజేసి వారందరు గణపతిం జూడవచ్చిరి. విభూతి పెండెకట్లు పెట్టుకొని జంగముదేవరవలె గూర్చున్న గణపతిం జూచి వారందరు నవ్వి "అదృష్టవంతురాలవమ్మా" యని యతని తల్లిని బరామర్శచేసి వెళ్ళిరి. నాఁటిరేయి మొదలు గణపతికి స్వప్నములలో స్మశానము కాష్టములు కటుకులు కుండపెంకులు గుడ్డపేలికలు చాపలు మొదలైనవి కనఁబడ జొచ్చెను. స్వప్నదృష్టములైన యా వస్తువులం జూచి యతఁడు పెద్దపెట్టున నేడ్చుచుండును. 'నే చావలేదు! నన్ను దహనము చేయకండోయి! యని కేకలు వేయుచుండును. తల్లి యతనిం గట్టిగఁ గౌగిలించుకొని పండుకొనవలసి వచ్చెను. ఆ పని యెవరు చేసిరని గణపతి తన ప్రక్కను రాత్రి పండుకొన్న బడిపిల్లలనుబిలిచి యడిగెను. ఆ శిష్యు లిట్లనిరి - "పంతులుగారు, రెండు జాముల రాత్రివేళ కాగడాలతో నెవరో కొందరు వచ్చిరి. ఎవరో మనుష్యులనుకొని మేము లేచి యెవరువా రని యడిగితిమి. వారు