పుట:Ganapati (novel).pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

303

కొనుచుఁ బోయిరి. అప్పుడు సింగమ్మ కొందరు పెద్దమనుష్యులం గనుంగొని "చూచినారా, నాయనా! కిట్టకపోతే కిట్టనట్లుండవలెను గాని యింత దుర్మార్గపుపని చేయవచ్చునా ? పోనీ కొంటెతనము కోసము చేసినారంటారా, వేళాకోళపు మాటలాడుకోవచ్చును, హాస్యములు చేసికోవచ్చును. సరసాలాడుకొనవచ్చును. గాని యింత కొంటెతనమున్నదా? ఒక్క బిడ్డ, నాకు. నా కెంతో వోగాయిత్యముగా నున్నది. ఈలాటి మోటసరసాలా. ఈ పని జేసిన దెవరో తెలిసినపక్షమున దుమ్మెత్తిపోసెదను. మునసబు గారితోఁ జెప్పి బొండ వేయించెదను. వాళమ్మ కడుపు గాలా, యీలాటి పనిచేసినవాళ్ళ వంశాలుండవురా, నాయనా! మీకు తెలిసెనా వాళ్ళ ముఖాలు చీకి తాటాకులతో తగులబెట్టి, నోట్లో గడ్డి పెట్టండి! అర్ధాయుస్సు ముండాకొడుకులకుఁ గాని యిట్టి బుద్ధులు పుట్టవు. నా మనస్సెంత క్షోభపడిందో వాళ్ళ తల్లులు గూడ యంత క్షోభపడవలెను. చూడు, నేనన్నాను. ఉత్తమ యిల్లాలను!" అని తా జెప్పవలసిన దంతయుఁ జెప్పి "రా నాయనా! యింటికి ! యీ కటుకుమీఁద నిన్ను మోసికొని వచ్చినవాళ్ళనే మోసికొని పోవుదురులే. నీవు చిరంజీవివై నూరేళ్ళు బ్రతుకఁ గలవు. ఆ దుర్మార్గపు ముండకొడుకులే రాళ్లు పగిలిపోయినట్లు తలలు పగిలి చచ్చిపోఁగలరు!" అని కుమారుని చేయి బట్టుకొని యింటికిఁ దీసికొనిపోయొ, దృష్టిఁ దీసి, వేడి నీళ్ళతో స్నానము చేయించెను. స్మశానవాసదోషము దొలఁగి