పుట:Ganapati (novel).pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

గ ణ ప తి

మహాదేవశాస్త్రిగారి గుమ్మము ముందరకుబోయి "శాస్త్రులు గారు! పంతులుగారి నెవరో చంపి వల్లకాటిలో వైచిపోయినారయ్యా!" యని కేకవేసి పోయిరి.

ఆమాట సింగమ్మ చెవిని బడగానే చేతిలో నున్న పనిని విడిచిపెట్టి "అయ్యో ! కొడుకా! అయ్యో కొడుకా, నీ వుసురెవరు పోసుకున్నారురా, కొడుకా! అయ్యో! అయ్యో శాస్త్రులుగారు! నా వరహాలచెట్టు నెవరో పడగొట్టినారట రండి నాయనా! రండి నాయనా, రండి" అని గుండె బాదుకొనుచు మొత్తుకొనుచు వీధిలోఁ బడెను. "అయ్యయ్యో! ఎంత పని, ఎంతపని! యింత పాపమున కెవడు వడిగట్టినారయా!" యని మహాదేవశాస్త్రిగారు, స్త్రీలు జాలిపడిరి. శాస్త్రి యామెం దోడ్కొని రుద్రభూమికరిగెను. సింగమ్మ త్రోవలో దుఃఖావేశము చేతఁ దన కుమారుని గుణగణములు మెచ్చుచు గ్రామవాసులం దిట్టుచు శపించుచు నరిగెను. వా రిరువురు వెళ్ళకముందే గ్రామవాసు లనేకు లచ్చట జేరి గణపతి చచ్చిపోయినాఁడని యొకరు, చావలేదు ప్రాణము గుడుగుడు లాడుచున్నదని యొకరు, ముక్కుదగ్గర వ్రేలుపెట్టి శ్వాస యాడుచున్నదో లేదో యని చూచువా రొకరు. శ్వాస యున్నది కాని యది కొనయూపిరి యని యొకరు, చచ్చిపోలేదు నిద్రపోవుచున్నాడు, అదిగో గుఱ్ఱని యొకరు, గుఱ్ఱు కాదయా గురక, గొంతు పిసికి చంపినారు అని యొకరు, గొంతు పిసికితే కంఠము వాచి యుండదా? గొంతు పిసకలేదు, కత్తితోఁ