పుట:Ganapati (novel).pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

295

కొన్న చోటికి వచ్చి కాళ్ళిద్దరు చేతు లిద్దరు పట్టుకొని యాదొడ్డిలోనికిఁ దీసికొనిపోయి యక్కటుకు మీఁద బండుకొనబెట్టి యతని యుత్తరీయమె మేనిమీఁద గప్పి జాఱిపోకుండ నారతోఁ గట్టి యా దారుణకర్మమున కపరిచితులయ్యు నలుగురు నాల్గు కొమ్ము లెత్తి భుజములపైఁ బెట్టికొని మోసికొని స్మశానభూమి కరిగిరి. అరిగిన తరువాత నేమి చేయవలెనో వారికిఁ దోచలేదు. నిద్ర మేల్కొలుపుద మని యొకడు, కాదు కాదు మరల నీ విధముగానే గృహమునకు తీసుకొనిపోవుదమని యొకడు చెప్పిరి. వారి యాలోచనలు ద్రోసిపుచ్చి మొట్టమొదట నీ చమత్కృతి సలుపు మని యుపదేశించిన యత డిట్లనియె "ఓరీ! మనము మొట్టమొద టేమనుకొన్నాము? తెల్లవారినదాక నిచట నునిచి, యీదారిన బోవు జనులకు వేడుక గలిగింపవలయు ననిగదా మన సంకల్పము! దానికి భిన్నముగా మన మిప్పు డేల యాచరింప వలయు? గావున నిది యీవిధముగానే యిక్కడనుంచి మన మిండ్లకు వెళ్లుదము. కాని పంతులుగారికి మిక్కిలి భయము గదా! మెలకువ వచ్చినప్పుడు వల్లకాడు చూచి భయపడి చచ్చిపోవు నేమో? యని మీకు సందేహము కలుగవచ్చును. కాని యట్టిసందేహమున కవకాశము లేదు. ఏలయన మనపంతుల వారికి సూర్యోదయ మగువఱకు మెలకువరాదు. ప్రతిదినము చూచుట లేదా? ఇంటిలోఁ బండుకొన్నపుడు తల్లియు, మహాదేవశాస్త్రి గారు ప్రొద్దెక్కినది లే లెమ్మని పెద్ద పెట్టున నఱచి, చేతులతో జఱచి లేపిన గాని లేచెడి