పుట:Ganapati (novel).pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

వారందఱుఁ మహానందభరితు లగుదురు. ఈ వృత్తాంతము విన్న వారందఱు గడుపు చెక్కలగు నట్లు నవ్వి వహవ్వా! యీ పని నెవరు చేసినారో గాని మిక్కిలి చమత్కారముగా జేసినారురా యని మెచ్చుకొందురు. మేమే యీపని చేసినా మని మన మెప్పుకొని యామెప్పును బొందుటకు వీలులేక పోయినను గ్రామవాసుల కింతటి యానందము గల్పించితిమి గదా యని మన మనంబులలో మనమే గర్వించవచ్చును. ఇది రహస్యముగ గట్టవలయునుగదా! ఎక్కడ గట్టుద మని మీరడుగుదురేమో, ఆ విషయమై విచారింప నక్కఱలేదు. మా దొడ్డిలో వెదుళ్ళున్నవి. వెదురు బద్దలున్నవి. మాదొడ్డిలో గోడ యొకమూల పడిపోయినది. ఆ దారిని వెళ్ళి మనము రెండు వెదుళ్ళు, రెండు బద్దలు తెచ్చి యీప్రక్క నున్న బోడిగోడల దొడ్డిలో కటుకు కట్టవచ్చును. తాటినార కూడ మా దొడ్డిలోనే యున్నది. తీసుకు వచ్చెదను. ఆయనకు మన మేమియు హాని చెయ్యవద్దు. ఇది మీకు సమ్మతముగా నున్నదా! లేని పక్షమున మీకు దోచిన విధము లెఱిగింపుడు." అతని పలుకులు తక్కిన మువ్వురకు శ్రవణానందకరములై మనఃప్రమోదావహములై యుండినందున వారు భళీ యని యాతని యుపాయమునకు మెచ్చి తక్షణమే ప్రయత్నము జేయుమనిరి. వెంటనే యతఁడు తన దొడ్డిలో నుండి వెదుళ్ళు, నార మొదలైనవి దెచ్చెను. నలుగురు గలిసి కష్టపడి పొట్టి కటుకు నొకదానిం గట్టిరి. అనంతర మా శిష్య చతుష్టయము గురువు పండు