పుట:Ganapati (novel).pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

గ ణ ప తి

మైత్రి కలదో గాని యతనికిఁ మాత్ర మామె ప్రసన్నురాలగును. దోమల సేనయు నల్లుల సేనయుఁ గలసి యాతని శరీరముపై పడినను మూసిన కన్ను దెఱువకుండ నతఁడు నిద్రింపఁ గలడు. మహాకవియైన వాల్మీకి, రామాయణ మహాకావ్యము నందు రావణానుజు డయిన కుంభకర్ణుడు నిరంతరము నిద్రాసక్తుడై యుండి యాఱునెలలు కొక్కసారి లేచు ననియు, లేచినప్పుడు వానిని వేల్పు లయిన గెలువలే రనియు, మాసషట్కము లోపల నతనిని మేల్కొలుపవలసివచ్చెనేని మసలఁగ్రాగిన చమురు మీఁద బోయుట, ధాన్యము తనువుపైఁ బోయించి యేనుగులచేత ద్రొక్కించుట మొదలగు భయంకర సాధనములు ప్రయొగింప వలె ననియు వ్రాసియున్నాడు. ఈ కలియుగంలోనే గణపతి వంటి దుర్వార నిద్రాపరాయణుడు జనించినప్పుడు మహాద్భుతముల కెల్ల నిలయమైన త్రేతాయుగమున కుంభకర్ణునివంటి నిరంతర నిద్రాప్రియుఁడు పుట్టియుండుట యాశ్చర్యము కాదని హేతువాదము సలుపునట్టి యీనాటి నవనాగరికులు నమ్ముట కవకాశము యున్నది. కాని కుంభకర్ణునకు మన గణపతికి నొక్క భేదము కలదు. కుంభకర్ణుడు బ్రహ్మదత్త వరప్రసాదమున షణ్మాస పరిమిత మయిన నిద్రం జెంద గలిగె. గణపతి యే దేవతాప్రసాదము లేకయె నిద్రావిషయమున నింత ప్రజ్ఞానవంతుఁడయ్యె. కావున నిరువురలో గణపతియె యొకవాసి గొప్పవాఁడని మనము నిశ్చయింప వచ్చును. నిద్రానుభవమున గణపతి కెంత నిరుపమాన ప్రజ్ఞ